రైతుల పొలాలకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి:ఎమ్మెల్యే
జాతీయ రహదారి 340 సీ కొరకు పొలాలను ఇచ్చిన రైతులకు పొలాలకు వెళ్లేందుకు రహదారి సమస్యలు ఉన్నాయని, రైతులకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తీర్చాలని నందికొట్కూరు
దిశ, నందికొట్కూరు: జాతీయ రహదారి 340 సీ కొరకు పొలాలను ఇచ్చిన రైతులకు పొలాలకు వెళ్లేందుకు రహదారి సమస్యలు ఉన్నాయని, రైతులకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తీర్చాలని నందికొట్కూరు శాసన సభ్యులు గిత్త జయసూర్య నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌ను కోరారు. శుక్రవారం నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు నుండి పాములపాడు మండలం ఎర్ర గూడూరు వరకు నేషనల్ హైవే 340 సీ రోడ్డు కొరకు రైతుల వందలాది ఎకరాల పొలాలను ఇచ్చారు. కొందరు రైతులు పొలాలకు వెళ్లాలంటే రోడ్ల సమస్యలు తలెత్తాయి. ప్రధానంగా ఈ హైవేలో రైతుల పొలాలకు సర్వీస్ రోడ్లు లేక పొలాలకు వెళ్లలేక పోతున్నామని బ్రాహ్మణ కొట్కూరు, దామగట్ల, బొల్లవరం, తంగడంచ, బన్నూరు, జుటూరు, తుమ్మలూరు, పాములపాడు పలు గ్రామాలకు సంబంధించిన రైతులు ఎమ్మెల్యేకు గత కొన్ని నెలల నుంచి ఫిర్యాదు చేశారు.
అయితే ఈ సమస్య పై ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పై జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం హైవే మీదుగా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు నుండి దామగట్ల, బొల్లవరం వరకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఆయన సానుకూలంగా స్పందించి రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు నేషనల్ హైవే పీడి పద్మజ, నందికొట్కూరు తహశీల్దార్ శ్రీనివాసులు, సర్వేయర్ త్యాగరాజు, వి ఆర్ ఓ లు నరసరాజు, స్వాములు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, ఎస్ ఐ తిరుపాలు, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి , హరి సర్వోత్తమ్ రెడ్డి , లక్ష్మీనారాయణ, ఖలీల్ బేగ్, పట్టణ కన్వీనర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.