Avanigadda వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. చెప్పులతో కొట్లాట (Video)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి సెగ తగ్గడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య ఆధిపత్య పోరు..అసమ్మతి బయటపడపుతుంది...

Update: 2023-01-28 14:27 GMT
  • ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
  • డ్వాక్రా, మత్స్యకారులకు చెక్కుల పంపిణీలో బయటపడ్డ విభేదాలు
  • తరిమితరిమి కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు
  • గొడవల్లేవ్ అంటూ సమర్థించుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి సెగ తగ్గడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య ఆధిపత్య పోరు..అసమ్మతి బయటపడపుతుంది. తాజాగా కృష్ణా జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఓ ఫ్లెక్సీ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదం అది కాస్తా చిరిగి చిరిగి పెద్ద చాంతాడంతైంది. ఎంపీ సై అంటే ఎమ్మెల్యే నై అనడం ఎమ్మెల్యే ఒకే అంటే ఎంపీ నో అనడం పరిపాటిగా జరుగుతూ వస్తుంది. అయితే శనివారం ఇరువురు మధ్య ఆధిపత్య పోరు నాబార్డు చైర్మన్ సాక్షిగా బయటపడింది. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు చెలరేగిపోయారు. చెప్పులు, చెంపదెబ్బలతో కొట్టుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా సరే తరిమితరిమి కొట్టుకున్నారు. ఇంతకీ ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరులు అంతలా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. ఇద్దరి మధ్య వివాదానికి ఫ్లెక్సీయే కారణమా లేక ఆధిపత్య పోరా? అసలు ఆలొల్లికి కారణమేంటో తెలియాలంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ రాజకీయం గురించి తెలుసుకోవాల్సిందే.

చెప్పులతో కొట్టుకున్న ఇరు వర్గాలు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబుల మధ్య మూడు నెలలుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవనిగడ్డ పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేశ్ బాబు అనుచరుల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కొట్టుకునేంత వరకు గొడవ వెళ్లింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్న చందంగా రాజకీయాలు మారిపోయాయి. పైకి బహిర్గతం కాకపోయినప్పటికీ అంతర్గతంగా ఎంపీ వర్గీయులు, ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే శనివారం వారి మధ్య ఆధిపత్యపోరు మరోసారి బట్టబయలయ్యింది. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్ యార్డు ఆవరణలో నాబార్డ్‌ చైర్మన్‌ కేవీ షాజి, నాబార్డ్‌ ప్రతినిధుల బృందం పర్యటించింది. మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఎంపీ బాలశౌరి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఎంపీ బాలశౌరి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. అనంతరం ఇరువర్గాలు రెచ్చిపోయారు. కొట్లాటకు దిగారు. ఇరు వర్గాలు పరస్పరం చెప్పులతో కొట్టుకుంటూ, చెంప దెబ్బలతో దాడికి దిగారు. తరిమితరిమి కొట్టుకున్నారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే రమేష్‌బాబుపై కూడా ఎంపీ వర్గీయులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో ఇరువర్గాలు చెల్లా చెదరయ్యాయి.

జర్నలిస్టులపైనా దౌర్జన్యం

ఇదిలా ఉంటే ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. చెప్పులు, చెంప దెబ్బలతో దాడికి దిగారు. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడ ఉన్న జర్నలిస్టులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వారిపై దౌర్జన్యానికి దిగారు. సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరికొందరి జర్నలిస్టుల కెమెరాను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే మేనల్లుడు దామోదర్ జర్నలిస్టుల సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

మా మధ్య విభేదాల్లేవ్: ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు

నాగాయలంకలో వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన తొపులాటపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు స్పందించారు. ఎంపీ బాలశౌరికి తనకు ఎటువంటి వర్గ విభేదాలు లేవని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే వర్గం అని తెలిపారు. ఎంపీ బాలశౌరి అనుచరులే తన అనుచరులని, తన అనుచరులే బాలశౌరి అనుచరులు అని చెప్పారు. తమ మధ్య విభేదాలు కేవలం మీడియా సృష్టేనని ఆరోపించారు. అయితే ఎంపీ బాలశౌరి వెంట వచ్చిన గరికపాటి శివ అనే వ్యక్తి నోటి దురుసు వల్ల తోపులాట జరిగిందన్నారు. గరికపాటి శివ అనే వ్యక్తి వైసీపీలో ఉంటూ టీడీపీ వాళ్లకి మద్దతు పలుకుతూ గొడవలు సృష్టిస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. టీడీపీ వాళ్ళతో కలిసి వర్గాలు సృష్టిస్తున్నందున అది తప్పు అని చెప్పినందుకు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఆ అంశంపైనే చర్చించగా తోపులాట జరిగిందని ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు తెలిపారు. 

Tags:    

Similar News