Ap News: కేశినేని నాని పయనం ఎటువైపు?
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి....
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పటికే పలు పార్టీలు టికెట్ల సర్ధుబాటులు, కేటాయింపులపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు చోట్ల టికెట్ల కేటాయింపులు జరిపినప్పటికీ..సర్ధుబాటు మాత్రం కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. ఇలాంటి తరుణంలో పార్టీ పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు తమ స్వరం పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వచ్చినా రాకపోయినా డోంట్ కేర్ అంటున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఖరాకండిగగా చెప్పేస్తున్నారు. సొంత పార్టీపై ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూనే అధికార పార్టీ నేతలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అదే సమయంలో అటు వైసీపీకి చెందిన నేతలు సైతం ఆ టీడీపీ అసంతృప్త నేతపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ టీడీపీ అసంతృప్తి నేత ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదూ..ఇంకెవరు విజయవాడ ఎంపీ కేశినేని నాని. గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వం పట్ల అసహనంతో రగిలిపోతున్న ఎంపీ కేశినేని నాని ఇటీవల కాలంలో వైసీపీ నేతలపై పొగడ్తలు కురిపించడం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇబ్బంది అని భావించే ముందుగా వైసీపీ నేతలను పొగుడూతూ మచ్చిక చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో వైసీపీ నుంచి ఆహ్వానాలు సైతం అందడంతో కేశినేని నాని పొలిటికల్ ఫ్యూచర్‌పై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
స్వపక్షంలో విపక్షం
తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే వైసీపీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన ముఖ్య నేతలు నానితో సంప్రదింపులు జరిపారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే సమయంలో ఎంపీ కేశినేని నాని వ్యవహరించిన తీరు అవుననేలా అనిపిస్తోంది. ఇటీవల కాలంలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులపై ఎంపీ నాని ప్రశంసలు జల్లు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ది కార్యక్రమాల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి పనిచేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చూడాలంటూ హితబోధ చేస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావును పొగడ్తలతో ముంచెత్తారు. అభివృద్ది కార్యక్రమాల విషయంలో జగన్మోహన్ రావు రాజీ పడరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలు వేరైనా అభివృద్ది కార్యక్రమాల విషయంలో కలిసి పనిచేస్తామంటూ కీలక ప్రకటన చేసేశారు. దేశంలో అధికార, విపక్షాలు ఇదే తరహలో పనిచేస్తే దేశం ముందుకు సాగుతుందంటూ చెప్పుకొచ్చారు. ఎంపీ వ్యాఖ్యలపై టీడీపీలోని ఓ వర్గం మండిపడింది. నానిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తీవ్ర విమర్శలు చేసింది. అయినప్పటికీ ఎంపీ కేశినేని నాని వెనక్కి తగ్గలేదు సరికాదా మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా నియోజకవర్గంలో మంచి చేసినవారిని పొగిడితే తప్పా అని నిలదీశారు. బెజవాడ అభివృద్ధి కోసం ముళ్ల పందిని కూడా ముద్దు పెట్టుకుంటానని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు టీడీపీకి చంద్రబాబు, వైసీపీకి జగన్ నాయకులని.. వారిద్దరికి వైరం ఉంటే తమకేంటంటూ కేశినేని నాని కుండ బద్దలు కొట్టారు. మరోవైపు విజయవాడ ఎంపీగా కేశినేని నాని టీడీపీకి కంటే వైసీపీలోని ఎమ్మెల్యేలకే అత్యధిక సహకారం అందిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలతో ఎంపీ కేశినేని నాని వైసీపీవైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులవ్వడంతో...
తెలుగుదేశం పార్టీపై ఎంపీ కేశినేని నాని అక్కసు వెళ్లగక్కడానికి పార్టీలోని కీలక నేతలే కారణమని తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో టీడీపీలో కీలక నేతలగా ఉన్న బొండా ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా మహేశ్వరరావులకు పడటం లేదు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నానికి అదే పార్టీలో ఉన్న నేతల మధ్య ఉన్న లొల్లి బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ విభేదాలే తన కుమార్తె మేయర్ కాకపోవడానికి కారణమని కేశినేని నాని ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి టీడీపీ నేతలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని టీడీపీ నాయకత్వం ప్రోత్సహించడం ఆయనకు నచ్చడం లేదు. అంతేకాదు రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీలో తన ప్రత్యర్థి వర్గంగా భావిస్తున్న వారంతా కేశినేని చిన్ని వెంట ఉండటం కేశినేని నానికి పొసగడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం పట్ల అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా
కేశినేని నాని 2014 ఎన్నికల్లో తొలిసారిగా విజయవాడ లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేుసి గెలుపొందారు. తొలిపర్యాయం చాలా విధేయతతో ఉండేవారు. అటు కేంద్రం వద్ద టీడీపీ వాయిస్‌ను...ప్రజల వాయిస్‌ను బలంగా వినిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి విధేయుడిగా మెలిగారు. ఇవే కారణాలతో 2019లో మరోసారి టీడీపీ టికెట్ ఇచ్చింది. మళ్లీ ఎంపీగా కేశినేని నాని రెండోసారి గెలుపొందారు. అప్పటి నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందారు. అంతే అవకావశం దొరికినప్పుడల్లా టీడీపీ పై నాని పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటరీ పార్టీలో తనకు కట్టబెట్టిన పదవులు కూడా తృణప్రాయంగా వదిలేస్తానని గతంలో క్లారిటీ సైతం ఇచ్చేశారు. తాజాగా టీడీపీ తనకు టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పేశారు. విజయవాడ ఎంపీ సీటు ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదు. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ కుండ బద్దలు కొట్టేశారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అంటూ గోడదూకేందుకు తాను సిద్ధమని కూడా పరోక్షంగా సంకేతాలు సైతం ఇచ్చేశారు. అంతేకాదు తన వ్యాఖ్యలను పార్టీ ఎలా తీసుకున్నా భయం లేదని కూడా చెప్పేశారు. పార్టీ టికెట్ ఇస్తుందా? నేను ఎంపీ అవుతానా? అనే భయం లేదు. నాకు ట్రాక్ రికార్డు ఉంది. నేను చేసినన్ని పనులు దేశంలో ఏ ఎంపీ చేయలేదు అని కేశినేని నాని చెప్పుకొచ్చారు.
వైసీపీలోకి స్వాగతించిన అయోధ్యరామిరెడ్డి
విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వస్తే స్వాగతిస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రాంరెడ్డి వెల్లడించారు. కేశినేని నాని ప్రజల కోసం పనిచేస్తాడని కితాబిచ్చారు. కష్టాల్లో ఉన్నవారి కోసం నాని ఎప్పుడూ పనిచేస్తాడని పొగడ్తలతో ముంచెత్తారు.వైసీపీలోకి కేశినేని వస్తే స్వాగతిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు.మరోవైపు ఎంపీ కేశినేని వ్యాఖ్యలపట్ల మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీలో ఇమడలేరని అర్థమవుతుందన్నారు. ఆయన వైసీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ కేశినేని నాని తమ పార్టీతో చర్చలు జరిపారంటూ వస్తున్న ప్రచారంపై తనకు ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు