పట్టాభిని పోలీసులు కొట్టలేదు.. స్పష్టం చేసిన SP Jashuva
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు కొట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు...
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు కొట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదని ఆయన హితవు పలికారు. పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారని... అయితే రెండుసార్లు డాక్టర్ల బృందం పరీక్షించినా ఎటువంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైందని స్పష్టం చేశారు. సీఐ కనకరావు గాయపడిన సంఘటనపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. దీనికి ఏం సమాధానం చెపుతారని ఎస్పీ జాషువా ప్రశ్నించారు. సీఐ కనకరావు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసని, ఇప్పుడు కొత్తగా కొందరు నాయకులు ఆయన బీసీ అనే వివాదాన్ని లేపడం అర్ధ రహితమని విమర్శించారు. కనకరావు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అవాస్తవాల ప్రచారం మానండి..
ఇకనైనా అవాస్తవాలను ప్రచారం చేయడం మానేసి కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించారు. గౌరవ కోర్టు వారు పట్టాభి ఇతర నిందితులను రిమాండుకు పంపడం..దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందనడానికి నిదర్శనమని చెప్పారు. అంతేగానీ లేనిపోని అబండాలు వేయడం ద్వారా పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తియ్యలేరని పేర్కొన్నారు. ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే పట్టాభి మూడు వాహనాల నిండా మనుషులతో గన్నవరం ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. వచ్చీ రాగానే మరింత మంది జనాలను పోగేసి పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగాడని తెలిపారు. పట్టాభి ప్రవర్తనలో గొడవలు సృష్టించాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
ఎవరూ ఫిర్యాదు చేయలేదు..
ఇంతవరకూ తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో ఫిర్యాదు ఇవ్వలేదు. అయినా పోలీస్ వారు, రాయిటింగ్, అర్సన్ వంటి కఠినమైన సెక్షన్లతో సూమోటోగా కేసు నమోదు చేసినట్లు వివరణ ఇచ్చారు. నిందితులను వీడియో ఫుటేజీ ద్వారా గుర్తించి, ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన ముద్దాయిలను గుర్తించి, అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఎస్పీ జాషువా ప్రకటించారు.