Kethireddy: అందరూ షర్మిలకే సపోర్ట్.. జగన్ ఏం చేశాడు.. అసలు జరిగిందేంటో మీకు తెలుసా ?

చెల్లిలితో చేసుకున్న ఆస్తి పంపకాల ఒప్పందంలో అసలు జరిగిందేంటో చెబుతూ వీడియో రిలీజ్ చేశారు కేతిరెడ్డి. షర్మిల కుట్రపూరితంగానే ఈ నాటకం ఆడుతోందని ఆరోపించారు.

Update: 2024-10-26 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్: జగన్ అనే వ్యక్తే లేకపోతే షర్మిలను ఎవరూ చూడరన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venktramireddy). ఏపీలో జగన్ (YS Jagan) ఉన్నాడు కాబట్టే.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) షర్మిల (Sharmila)కు పీసీసీ చీఫ్ (APCC Chief) పోస్ట్ ఇచ్చిందని, ఆమె ద్వారా జగన్ ను ఇబ్బంది పెట్టాలని వాడుకుంటోందని వ్యాఖ్యలు చేశారు. అంతేగాని ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓటింగ్ పర్సెంట్ పొందిందని ఆ పదవి ఇవ్వలేదన్నారు.

అందరూ జగన్.. తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ఇబ్బంది పెడుతున్నాడని మాట్లాడుతున్నారు కానీ.. అసలు ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో తెలిస్తే అలా మాట్లాడరని కేతిరెడ్డి పేర్కొన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 2,3 నెలల తర్వాత జగన్ తన చెల్లి షర్మిలను పిలిచి తండ్రి, తాత సంపాదించిన ఆస్తులు కాకుండా.. తన సొంతంగా పెట్టుబడి పెట్టి సంపాదించిన ఆస్తులు ఇచ్చేందుకు ఎంఓయూ (MOU) చేసుకున్నారని తెలిపారు. సాక్షి, భారతి కంపెనీలతో పాటు.. ఇతర కంపెనీల్లోనూ షర్మిలకు భారీగా షేర్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని కేతిరెడ్డి వెల్లడించారు. షర్మిలను జగన్ ఒక అన్నలా కాకుండా.. కూతురిలా చూసుకున్నారన్నారు.

ఆస్తి పంపకాల్లో విభేదాలు రావడంతో షర్మిల.. జగన్ కు వ్యతిరేకంగా మారిందన్న కేతిరెడ్డి దానివెనుక ఉన్న కారణాన్ని వివరించారు. బాబాయ్ వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్యపై షర్మిల ఇప్పుడు మాట్లాడుతుంది కానీ.. ఆయన ఉన్నప్పుడు చాలా నీఛంగా చూసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం సునీతకు కూడా తెలుసన్నారు. కొన్ని కారణాల వల్ల షర్మిలకు ఇచ్చిన ఆస్తుల్ని .. కోర్టులో కేసు క్లియర్ అయ్యాక చెల్లుబాటయ్యేలా రాయించుకున్నారు.

3-4 నెలల క్రితం జగన్ ను కలిసిన విజయమ్మ.. ఎంఓయూతో షర్మిల ఇబ్బంది పడుతోందని, తనపేరు మీదికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆస్తి ఎక్కడికీ పోదన్న ధైర్యం ఉంటుందని మాట్లాడారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షేర్స్ పోయినట్లు ట్రాన్సాక్షన్లు జరిపారని తెలిపారు. ఈడీ అటాచ్ మెంట్లో ఉన్న ఆస్తులపై లావాదేవీలు జరపకూడదని అందరికీ తెలుసని, కానీ.. షర్మిల ఆ పని చేసి జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా చూస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కు ముందు కూడా షర్మిల ఒక వీడియో రిలీజ్ చేసి అందరినీ నాశనం చేసిందన్నారు. కొడుకును ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరే నాశనమవుతారని విజయమ్మ (Vijayamma)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో ప్రజలు గ్రహించాలని కోరారు.

Tags:    

Similar News