ఊపందుకున్న కేశినేని బ్రదర్స్ వార్.. నాని వ్యాఖ్యలుపై చిన్ని కౌంటర్

అన్నదమ్ముల మధ్య కూడా అగ్గి రాజేయగల సమర్థత, సామర్థ్యం కేవలం రాజకీయాలకే ఉంది.

Update: 2024-01-11 06:53 GMT

దిశ వెబ్ డెస్క్: అన్నదమ్ముల మధ్య కూడా అగ్గి రాజేయగల సమర్థత, సామర్థ్యం కేవలం రాజకీయాలకే ఉంది. ప్రస్తుతం కేశినేని కుటుంబం విషయంలో కూడా ఇదే జరిగింది. బెజవాడ ఎంపీగా ఉన్న కేసినేని నానిని కాదని ఆయన సోదరుడు కేసినేని చిన్నికి టిడిపి అధిష్టానం విజయవాడ లోక్ సభ స్థానాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో కేసినేని నాని టిడిపి నుండి బయటకు వచ్చేశారు. ఆయనతోపాటు ఆయన కుమార్తె కేసినేని శ్వేత కూడా టిడిపికి రాజీనామా ఇచ్చారు. అయితే కేశినేని నాని వైసీపీలో చేరుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సీఎం జగన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టిడిపి కోసం ఎంతో శ్రమిచానని.. తన వ్యాపారాలు కూడా పక్కన పెట్టి టీడీపీకి సేవ చేశానని.. అయినా టిడిపి అధిష్టానం ఆయనను పక్కన పెట్టిందని.. అలాంటి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన కుటుంబంలో టిడిపి పార్టీ చిచ్చు పెట్టిందని.. అన్నదమ్ముల మధ్య గొడవకు కారణమైందని కేసినేని నాని వ్యాఖ్యానించారు. కాగా తాజాగా కేసినేని నాని వ్యాఖ్యలపై కేసినేని చిన్ని స్పందించారు. తనకు కేసినేని నానికి మధ్య 1990 నుంచి గొడవలు ఉన్నాయని.. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని.. దీనికి మధ్యలో టిడిపి పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు?

మొదట నుండి కేశినేని నాని తనని అవమానిస్తూనే ఉన్నారని.. ఆయన తాను సర్దుకుపోతున్నట్లు కేసినేని చిన్ని తెలిపారు. అసలు కేసినేని నానికి నందమూరి కుటుంబాన్ని గాని, చంద్రబాబు కుటుంబాన్ని గాని అనే అర్హత  ఏ మాత్రం లేదని పేర్కొన్నారు. కేశినేని నాని రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పెట్టిన భిక్షతో రాజకీయా అరంగేట్రం చేసిన నాని ఈరోజు ఆయనని విమర్శిస్తూ.. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని టిడిపిని వీడినంతమాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొన్నారు. మొదటి నుండి పదవి కాలం పూర్తయిన వెంటనే కేశినేని నాని వైసీపీ పార్టీలో చేరుతున్నారని వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పార్టీకి రాజీనామా ఇచ్చి వైసీపీలో చేరి ఆ వార్తను నిజం చేశారని మండిపడ్డారు.

Tags:    

Similar News