టీడీపీ, జనసేన పొత్తుపై కుట్ర.. అబద్ధపు లేఖపై హరిరామజోగయ్య ఆగ్రహం
టీడీపీ, జనసేన పొత్తుపై కుట్ర చేస్తున్నారంటూ కాపు సంక్షేమ నేత హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఫేక్ లేఖలు హల్ చల్ చేస్తున్నాయి. ఇష్టం లేని పార్టీలకు వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారు. ఏకంగా సామాజిక వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా పవన్ కల్యాణ్ సామాజిక వర్గంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్, కాపు సంక్షేమ సంఘం నేత హరిరామజోగయ్య మధ్య ఎలాంటి సన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. అయితే హరి రామజోగయ్య పేరుతో పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుని కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారంటూ హరిరామ జోగయ్య అన్నట్టు లేఖలో రాసి విడుదల చేశారు. దీంతో ఆ సామాజిక వర్గంలో గందరగోళం నెలకొంది. హరి రామజోగయ్య రాసినట్లుగా ఉన్న లేఖతో ఆందోళన మొదలైంది.
దీంతో వెంటనే హరిరామజోగయ్య అలర్ట్ అయ్యారు. స్వయంగా ఓ లేఖను విడుదల చేశారు. పవన్ కల్యాణ్, తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య లేఖలను ఎవరూ నమ్మవద్దనిపేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాలను కొందరు నాయకులు ఆసరాగా చేసుకుంటున్నారన్నారు. తద్వారా పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని హరిరామజోగయ్య ఆరోపించారు టీడీపీ, జనసేన పొత్తును భగ్నం చేసేందుకు అసత్య ప్రచారానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతి పరులు గాని, ఆ పార్టీ నేతలు కాని అబద్ధపు లేఖను విడుదల చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను రాష్ట్ర ప్రజలు, జనసైనికులు నమ్మొద్దని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, జనసైనికులు వైసీపీ ట్యాప్‌లో పడొద్దని సూచించారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని హరిరామజోగయ్య జోస్యం చెప్పారు.