Palamaneru: ఒంటరి ఏనుగు హల్ చల్
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది....
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఒంటరి ఏనుగు(Elephant) హల్ చల్ చేసింది. వారం రోజులుగా పలమనేరు నియోజకవర్గం(Palamaneru Constituency) పరిధి గంటవూరులో సంచరిస్తోంది. రాత్రి సమయంలో రోడ్లపైకి వస్తోంది. వాహనదారులపై దాడి చేసేదుకు ప్రయత్నం చేస్తోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న వడ్ల గోదాము వద్ద ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. అంతేకాదు మొగిలి, గౌరీశంకరపురం, మొగలివారిపల్లి, టేకుమంద మామిడికుంట గ్రామాల్లో ఇళ్లతో పాటు పంట పొలాలపైనా దాడులు చేస్తోంది.
దీంతో స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒంటరి ఏనుగు ఎప్పుడు ఏం చేస్తుందోనని భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఏనుగును అటవీ ప్రాంతంలోకి పంపించాలని, తమ పొలాలు వైపు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. స్థానిక ప్రజల ఫిర్యాదుతో అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే స్థానికులు రాత్రి సమయంలో బయట తిరగొద్దని అధికారులు సూచించారు. పొలాలకు వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.