దిశ, ఏపీ బ్యూరో: పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలకు ప్రయత్నించినా ఫలించలేదు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందామని మంత్రులు నేతలను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఆదివారం సమావేశమైన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సుదీర్ఘ చర్చల అనంతరం, కీలక నిర్ణయాలు వెల్లడించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ ఛాంబర్‌లో ఐకాస సంఘాల నేతలంతా సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యచరణను పటిష్టంగా అమలు చేయాలని సూచించింది. జిల్లాల్లో రోజూ జరిగే ఉద్యమంపై స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల్లోని పీడీఎఫ్ ఎమ్మెల్సీలను కలుపుకొని ఉద్యమానికి వెళ్లాలని తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, హృదయ రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఆదివారం నేతలకు ఫోన్లు చేసి, సంప్రదింపులకు రావాలని కోరారు. సమ్మె నోటీసు ఇవ్వొద్దని, సామరస్యపూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని మంత్రులు కోరారు. కానీ ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని నేతలు స్పష్టం చేశారు.