JC Prabhakar Vs kethireddy : ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు
తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించార. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. అలాగే జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి రాకుండా కార్యకర్తలు, ఇతరులు ఎవరూ రాకుండా ఉండేలా బారికేడ్లను సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకోవడం సరికాదని జేసీ ప్రభాకర్ అన్నారు. ఈ చర్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇది ధర్మం కాదంటూ మండిపడ్డారు. ఇకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దపప్పురు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే అందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కళ్యాణ మండపం పనులకు భూమి పూజ చేసేందుకు వెళ్తే అడ్డుకుంటారాఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గృహనిర్బంధం విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి తరలివచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకుని పంపించి వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.