JanaSena: పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ
దళిత వైద్యుడిపై దాడి చేసిన విషయంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దళిత వైద్యుడిపై దాడి చేసిన విషయంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులు రంగరాజ వైద్యకాళాశాలలో వాలీబాల్ ఆడేందుకు అనుమతించలేదని, దళిత వైద్యుడు, ఫోరెన్సిక్ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. ఇందులో తన తప్పేమి లేదని ఉన్నతాధికారుల అనుమతులు వచ్చే వరకు ఆగాలని వైద్యుడు చెబుతున్న వినకుండా.. ఆయనపై దుర్భషలాడారు. ఇంతలో ఎమ్మెల్యే మేనల్లుడు బన్నీ ప్రొఫెసర్ పై చేయి చేసుకున్నారు.
దీంతో ఉమామహేశ్వరరావు పై జరిగిన దాడిని ఖండిస్తూ వైద్య విద్యార్దులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ ఘటనపై గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైంది. దీనిపై జనసేన నేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ దాడిలో అడ్డుకోబోయిన వైద్య విద్యార్ధులకు కూడా గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు దాడిలో పాల్గొన్న అతని అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. కాగా ఘటనపై బాధిత వైద్యుడు ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేను ఏ1గా చేర్చి కేసు నమోదు చేయాలని, దాడిలో ఉన్న వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. గాయపడిన విద్యార్ధులకు సానుభూతని తెలియజేశారు.