ఈనెల 9న జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ భేటీ.. షణ్ముఖ వ్యూహంపై చర్చ
తెలుగుదేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేందుకు రెడీ అయ్యాయా?
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేందుకు రెడీ అయ్యాయా? ఇప్పటికే పొత్తును ప్రకటించిన ఇరు పార్టీలు బీజేపీతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయా?ఇప్పటికే రాష్ట్రస్థాయి, జిల్లాల స్థాయి సమన్వయ కమిటీల సమావేశం జరగడంతో ఆ ప్రతిపాదనలపై చర్చించనున్నారా? రెండు పార్టీలు ప్రజల్లోకి ఏ విధంగా కలిసి వెళ్లే అంశంపై విస్తృతంగా చర్చించనున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఈ రెండు పార్టీలు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే పొత్తులో భాగంగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్న పార్టీలో ప్రజాక్షేత్రంలోకి ఉమ్మడిగా కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఏయే అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలి..? ప్రాంతాల వారీగా వెళ్లాలా? అలాగే ఆయా ప్రాంతాలలోని ప్రధాన సమస్యను పట్టుకుని పోరాటం చేయాలా? అనే అంశాలపై చర్చించి ఓ ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు పార్టీలు కార్యచరణ ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
ఉమ్మడి కార్యచరణపై చర్చ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఏపీ రాజకీయాల పరిణామాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్కిల్ స్కాం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు నాయుడుకు ఏఐజీ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అనంతరం ఇరువురు రెండున్నర గంటల సేపు పలు అంశాలపై చర్చించుకున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏవిధంగా వెళ్లాలి అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర చేస్తున్నారు. ఇకపోతే టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు టీడీపీ నిరసనలు చేస్తోంది. మరోవైపు జనసేన సైతం పార్టీ హైకమాండ్ ఆదేశాల ప్రకారం నిరసనలు చేస్తోంది. అయితే ఇకపై ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసేలా కార్యచరణ రూపొందించాలని ఇరువురు మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
కరవుపై కలిసి పోరాటం
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరవు అంశం కుదిపేస్తోంది. వరుణిడి కరుణ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొంది. ఉత్తరాంధ్రతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోనూ సాగునీటికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరవుపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ కానీ పరిహారం అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి కష్టసమయంలో అన్నదాతకు అండగా ఉండాలని అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. కరవు అంశంపై ఉమ్మడి కార్యచరణ ఖరారు చేసి ఉద్యమం చేపట్టాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో రైతులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకముందే తామున్నామనే భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి కార్యచరణ సిద్ధం చేద్దాం అని ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
షణ్ముఖ వ్యూహంపై చర్చ
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో దూసుకెళ్తుంది. మహానాడు వేదికగా ప్రకటించిన హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ కార్యచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఉమ్మడి మేనిఫెస్టో అంశంపై కూడా పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టోకోసం పవన్ కల్యాణ్ ఇదివరకే ప్రకటించిన షణ్ముఖ వ్యూహం పేరుతో 6 ప్రతిపాదనలను తీసుకురాగా వాటిపై లోతైన అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ షణ్ముఖ వ్యూహంలో ప్రధానంగా మెుదటి అంశంగా అమరావతి రాజధానిగా కొనసాగింపు... విశాఖ, తిరుపతి, విజయవాడను క్లస్టర్ల వారీగా మహానగరాలుగా అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సంపన్న ఏపీ పేరిట వివిధ రంగాలకు ఆర్థిక ప్రోత్సాహం... వ్యవసాయం-బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు. చిన్న నీటి పారుదల రంగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను పవన్ కల్యాణ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే మన ఏపీ-మన ఉద్యోగాలు పేరుతో ప్రతీ ఏడాది పోస్టుల భర్తీ ప్రక్రియ. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రతిపాదించారు. అలాగే ‘చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల సాయం. చిన్న పరిశ్రమలకు చేయూతతో ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక... ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేయూత. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఇళ్లకు ఉచితంగా ఇసుక పంపిణీ’ వంటి అంశాలను పవన్ కల్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. ఇరువురు మధ్య ఈ షణ్ముఖ వ్యూహం అమలుపపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈనెల 9న ఉమ్మడి సమావేశం
ఇకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య ఉమ్మడి సమావేశం నిర్వహించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈనెల 9న విజయవాడ వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు సమన్వయ కమిటీ సభ్యులు అటు టీడీపీ నుంచి నారా లోకేశ్, యనమల రామకృష్ణుడుతోపాటు ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఉమ్మడి సమావేశం వేదికగా రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.