మణిపూర్‌లో అల్లర్లతో జగన్ సర్కార్ అలర్ట్
మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్‌లో అల్లర్లు కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఏపీ విద్యార్ధులు మణిపూర్‌లో చదువుతున్నట్టు గుర్తించారు. వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
ఈ మేరకు పౌరవిమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు.
అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు..
మణిపూర్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్న ఘటనపై అత్యవసర హెల్ప్ లైన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అల్లర్లలో చిక్కుకున్న వారిని సహాయం అందిస్తామని ప్రకటించింది. 011-23384016, 011-23387089 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. మణిపూర్‌లో ఉన్న ఏపీ వాసుల సహాయం కోసం అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తో మాట్లాడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.