ఏపీలో కరువు తాండవిస్తున్నా జగన్‌కు పట్టడం లేదు: సీపీఐ నేత రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో కరువు విలయతాండవం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు.

Update: 2023-10-25 11:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో కరువు విలయతాండవం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు కరువు తాండవిస్తోందని చెప్పుకొచ్చారు. 679 మండలాల్లో 300 పైచిలుకు మండలాలు దుర్బిక్షంగా మారాయని చెప్పుకొచ్చారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. జగన్‌కు రైతు, ప్రజా సమస్యలు పట్టడంలేదని చెప్పుకొచ్చారు. జైళ్లు, కోర్టులు, కక్షలు తప్ప జగన్‌కు ఏమీ పట్టడం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీకి జగన్ దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. చంద్రబాబు అరెస్టులో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జగన్ ఉమ్మడి పాత్ర ఉంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. 

భవిష్యత్‌లో తాగునీటికి ఎద్దడి

దేశంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరువు తీవ్రతపై కేంద్రానికి నివేదికలు సైతం అందిస్తున్నాయని వెల్లడించారు. కానీ ఇవేమీ వైఎస్ జగన్‌కు పట్టడం లేదని విమర్శించారు. రైతాంగం వేలాది రూపాయలతో పంట వేస్తే సాగునీరు అందక ఆ పంట ఎండిపోతుందని అన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలలో సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి అని అన్నారు. గతంలో ఎప్పుడు శ్రీశైలం, సాగర్ డ్యాంలలో ఇంతటి నీటి కొరత లేదని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తాగునీటి సమస్య కూడా జఠిలం అయ్యే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ చెప్పుకొచ్చారు.

వైసీపీకి బీజేపీ సహకారం

రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త చొక్కా విప్పించడం,సైకిల్ కి కట్టుకున్న టీడీపీ జెండా తొలంగించడం నీచాతినీచం అని అన్నారు. ఇది కేవలం టీడీపీ సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతిపెడుతున్న జగన్ సర్కార్ పై ప్రతిఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పురంధేశ్వరి విజ్ఞప్తి చేయడంపై మండిపడ్డారు. ఫోరెన్సిక్ ఆడిట్ అనే పదం ఇప్పుడే వింటున్నట్లు ఎద్దేవా చేశారు. రాష్ట్రం అప్పులకుప్పలా మారడానికి సహకారం అందించింది కేంద్రం కాదా? అని నిలదీశారు. బీజేపీ,వైసీపీ డ్రామాలు ఆడుతోందన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది బీజేపీ సహకారంతోనేనని టీడీపీ, జనసేన గమనించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సూచించారు.

Tags:    

Similar News