మనవడిని అంటూనే మా నోట్లో మట్టికొట్టాడు: వైఎస్ జగన్‌పై మాజీమంత్రి సంచలన ఆరోపణలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Update: 2023-07-28 10:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు తాజాగా కీలకమైన రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించారు. ఆగస్టు 1నుంచి రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తారని మాజీమంత్రి, టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. అనంతపురంలో శుక్రవారం కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. తొలుత రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాలలో చంద్రబాబు పర్యటిస్తారని అనంతరం ఆగస్టు 3న చంద్రబాబు అనంతపురం జిల్లాకు వస్తారని తెలిపారు. ఆగష్టు 4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్‌లో ఇతర ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారని కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపై పరిశీలన జరుగుతుందని అయితే మెుదట రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తారని కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కాల్వ శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ భవిష్యత్‌తో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని విరుచుకుపడ్డారు. కరవు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టులను జగన్ ఆపేశారంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసమర్థత వల్ల రాయలసీమలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ జీవనాడి లాంటి హంద్రీనీవా వెడల్పును ప్రభుత్వం అడ్డుకుందని..పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తానని చెప్పి టెండర్లు కూడా పిలవకుండా ప్రాజెక్టుకు మోకాలడ్డారని విరుచుకుపడ్డారు.ఇటువంటి దుర్భుద్ధితో అనంతపురం జిల్లాకు సీఎం వైఎస్ జగన్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా మనవడినని చెప్తూనే అనేక ప్రాజెక్టులను ఆపేసి నయవంచనకకు సీఎం జగన్ పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న నయ వంచనను ప్రజలకు తెలియజేసేందుకు చంద్రబాబు రాయలసీమకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్ని చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News