తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. కేసీపీ సంస్థ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీపీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కాంట్రాక్ట్‌లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసీపీ సంస్థలపై ఐటీ దాడులు జరగడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ కేసీపీ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అనిల్ భారీ మెుత్తంలో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు కూడా కేసీ సంస్థే చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌లోని కేసీ పుల్లయ్య సంస్థల్లోనూ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నాయి.అంతేకాదు కేసీపీ సంస్థ ఇంకా ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ నిర్వహిస్తోంది అనేదానిపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రొద్దుటూరులోని బంగారం దుకాణాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు మరవకముందే మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.