CM జగన్‌కు మరో భారీ షాక్.. త్వరలోనే టీడీపీ గూటికి YCP మంత్రి..?

అధికార వైసీపీకి మరో షాక్ తగలబోతున్నది. మంత్రి గుమ్మనూరు వైసీపీని వీడి సైకిలెక్కనున్నట్లు ప్రచారం జోరందుకుంది.

Update: 2024-02-23 04:28 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: అధికార వైసీపీకి మరో షాక్ తగలబోతున్నది. మంత్రి గుమ్మనూరు వైసీపీని వీడి సైకిలెక్కనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆలూరు టికెట్ తన ప్రత్యర్థి విరుపాక్షికి ఇవ్వడం ఇష్టంలేని మంత్రి కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యక్షమైన మంత్రి పలుమార్లు సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అందుకు అధిష్టానం అందుకు నిరాకరించింది. వారం క్రితం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మనవడి వివాహ వేడుకలకు హాజరైన సీఎంను కలిసిన సందర్భంలో కూడా ఆయనకు ఆశించిన మేరకు ప్రతికూల పరిస్థితులు కన్పించలేదు. దీంతో ఓ నిర్ణయానికొచ్చిన మంత్రి టీడీపీ గూటికి చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు టీడీపీలో చేరే అవకాశాలున్నాయన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రత్యర్థికి సీటు కేటాయించడంతో..

కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం త్వరలో వైసీపీని వీడి సైకిలెక్కనున్నట్లు వార్తలు విన్పిస్తు్న్నాయి. వైసీపీ అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించింది. ఆలూరు ఇంచార్జిగా విరుపాక్షిని కేటాయించింది. తన ప్రత్యర్థి విరుపాక్షికి సీటు కేటాయించడాన్ని సహించలేక మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లారు. మంత్రి ఎంపీ స్థానానికి సుముఖంగా లేకపోవడంతో అధిష్ఠానం కర్నూలు నగర మేయర్ బీవై రామయ్యకు ఎంపీ టికెట్ ఖరారు చేసింది. దీంతో మంత్రి వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఆలూరు టీడీపీ ఇంచార్జి కోట్ల సుజాతమ్మ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబంలో ఒకరికే సీటు కేటాయించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మలలో ఎవరికి టికెట్ వరిస్తుందో వేచి చూడాల్సిందే.

అంచనాలు తారుమారు..

తన ప్రత్యర్థి విరుపాక్షికి ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించడంతో మంత్రి గుమ్మనూరు కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తొలుత చర్చలు జోరందుకున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి నాగేంద్రతో సంప్రదింపులు చేశారనే ప్రచారం నడిచింది. అక్కడి మంత్రి నాగేంద్ర జయరాంకు సోదరుడు. కాంగ్రెస్‌లో చేరితే ఆయనకు ఆలూరు టిక్కెట్ కేటాయించడంతో పాటు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది. అయితే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఐదు సీట్లు కోరుతున్నట్లు వార్తలు విన్పించాయి. ఉన్నట్లుండి మంత్రి.. ప్రజలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలు తారుమారయ్యేలా వ్యవహరించారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నారన్న వార్తలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రతికారం తీర్చుకునేందుకు..

అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డిలు అన్నాదమ్ములు. వీరు మంత్రి గుమ్మనూరుకు వ్యతిరేకంగా సీటు రాకుండా చేసి విరుపాక్షికి ఇప్పించారని మంత్రి భావిస్తున్నారు. ఈ క్రమంలో వీరిపై ప్రతికారం తీర్చుకునేందుకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి గుంతకల్ సీటుతో పాటు ఆలూరు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబుకు నివేదించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా స్పష్టత రానుంది.

Read More : YSRCP: టీడీపీ, జనసేన రెబల్స్‌పై వైసీపీ ఫోకస్.. కుదిరితే వారికి ఆ ఆఫర్!

Tags:    

Similar News