‘ఆమంచి’ హవా ముగిసినట్లేనా? అంతులేని కథగా కృష్ణమోహన్ రాజకీయం
చీరాల నియోజకవర్గంలో ఆమంచి కథ అంతులేని కథ అన్నట్లుగా తయారైంది.
చీరాల నియోజకవర్గంలో ఆమంచి కథ అంతులేని కథ అన్నట్లుగా తయారైంది. ఒకప్పుడు చీరాలను శాసించిన ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా మారారు. ఏనాటి పాపం ఆనాటిది అన్నట్టుగా ఆయన చేసిన పాపాలు ఒక్కొక్కటి వెంటాడుతున్నాయి. ఇక ఆమంచి రాజకీయ జీవితం ముగిసినట్లేనని చీరాల నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. నాకు తిరుగులేదు అనుకున్నాడో ఏమో ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే సామాన్యుడు కూడా ‘అయ్యో పాపం.. ఆమంచి’ అనేవాడే కరువయ్యాడు. అంటే కర్మ ఫల సిద్ధాంతమే కారణం కాదు చేసిన పాపాలు కూడా అలాంటివే అనే విమర్శలు ఇప్పుడు ఆ మంచి కృష్ణమోహన్‌పై బహిరంగంగా వినిపిస్తున్నాయి.
దిశ ప్రతినిధి, బాపట్ల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమంచి కృష్ణమోహన్ పేరు తెలియని వారంటూ ఉండరు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శిష్యుడిగా చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఒక వెలుగు వెలిగాడు. రాజకీయం అంటే రౌడీయిజం మాఫియా అనుకున్నాడు. అప్పట్లో ఆమంచికి అండగా రోశయ్య ఉండడంతో ఆమంచి చెప్పిందే వేదమైంది. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ 2014 లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఉన్న నాయకులతో ఇమడలేక 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ తరఫున 2019లో అప్పటి టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై ఓటమిపాలయ్యారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమంచి హవా అలానే కొనసాగింది. అయితే కరణం బలరాం టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లడంతో ఆమంచికి గండి పడింది. చీరాలలో ఆమంచి పెత్తనం తగ్గించడానికి వైసీపీ అధిష్టానం పర్చూరు సమన్వయకర్తగా నియమించింది. అక్కడికి వెళ్లాలని చెప్పడంతో ఆమంచి విధి లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లినట్లుగా ఆయన వర్గీయులే అప్పట్లో చెప్పుకున్నారు. ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఆమంచి రాజకీయ జీవితం డైలమాలో పడింది. పర్చూరు సమన్వయకర్తగా ఆయన ప్రత్యర్థైన ఎడం బాలాజీకి అప్పగించడం చీరాలలో కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కు సీటు కేటాయించడంతో ఆమంచి రాజకీయ జీవితం ముగిసినట్లే అన్నట్లుగా తయారైంది.
ఏనాటి కర్మ ఆనాటిదే అన్నట్లుగా..
ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదగి ఉండాలన్నది ఆయన గమనించినట్లు కనిపించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని నాయకుడిగా ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ జీవితం నడిచింది. 2009 ఎన్నికల్లో కొణిజేటి రోశయ్య ఆమంచి కృష్ణమోహన్‌కు సీటు కోసం ఎంతో కష్టపడ్డారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డికి ఇష్టం లేకపోయినా కొణిజేటి రోశయ్య మాట తీసేయలేక ఆ మంచికి సీటు కట్టబెట్టినట్లుగా అప్పట్లో పుకార్లు వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా మరణించడంతో రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ హవాకి ఎదురు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ నుంచి ఇసుక మాఫియా సెటిల్మెంట్స్‌లో అన్నీ ఆమంచి హస్తం పెరిగిపోయింది. మీడియా కూడా ఆమంచి హవాను అడ్డుకోలేకపోయింది. అంటే ఆయన రౌడీయిజం ఎంతగా నడిచిందో చీరాల నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. ఏనాటి కర్మ ఆనాటిది అన్నట్లుగా ఇప్పుడు ఆమంచి రాజకీయ జీవితం మసకబారిపోతుంది.
నిలకడ లేని ఆమంచి రాజకీయం
2009 కాంగ్రెస్‌లో గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ జీవితం నిలకడ లేకుండా పోయిందనేది చీరాల నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారంటే అప్పట్లో ఆమంచి ఆర్థికంగా బలంగా ఉండి ప్రజలకు డబ్బుతో ఏదైనా కొనవచ్చు అన్నట్లుగా రాజకీయం చెలామణీ అయ్యింది. రౌడీయిజం చేసి డబ్బు లు నీళ్ల ప్రాయంలా ఖర్చు చేసి కులాల వారీగా మతాలవారీగా ఓట్లు వేయించుకొని గెలుపొందారు అనేది అప్పట్లో చర్చించుకోవడం విశేషం. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మళ్లీ తన హవాను కొనసాగించారు.
ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ ఆమంచిపై అనేక విమర్శలు చేయడంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆమంచిని పిలిపించుకొని మరీ వార్నింగ్ ఇచ్చారని కూడా తెలిసింది. దీంతో ఆమంచి 2019లో అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ జగన్ కూడా ఆమంచిను మించిన నాయకుడు లేకపోవడంతో గతి లేని పరిస్థితుల్లో టికెట్ కట్టబెట్టారు. కృష్ణమోహన్ అంతటి గాలిలో కూడా ఓడిపోవడం వైయస్ జగన్ కృష్ణమోహన్‌పై కేవలం సవతి తల్లి ప్రేమ మాత్రమే అనేది రాను రాను ఆమంచి తెలుసుకున్నారు. రాజకీయ కక్షలు అంటే రౌడీయిజం కాదనేది ఇప్పుడు తెలుసుకుంటే ఆమంచి రాజకీయ జీవితం ఉదాహరణని చీరాల ప్రజలు చెప్పుకోవడం చర్చనీయాంశమైంది.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో..?
ఆమంచి కృష్ణమోహన్ కి అన్ని పార్టీలు గేట్లు మూసి వేయడంతో మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తన అనుచరులతో చెబుతున్నట్లుగా తెలిసింది. మొదటినుంచి ఆమంచికి యాదవ ఎస్సీ సామాజిక వర్గం ఆయన వెంట ఉండేది. ఇప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలు దూరంగా ఉండటంతో ఆమంచి సందిగ్ధంలో పడినట్లుగా తెలిసింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి తప్పదు అనేది ఆయనను వెంటాడుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆమంచి ఎలాంటి రాజకీయం చేస్తాడో అని చీరాల ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
Read more..
నందికొట్కూరులో త్రిముఖ పోరు.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఎమ్మెల్యే ఆర్థర్