పాలిటిక్స్‌లోకి ఆంధ్రా ఆక్టోపస్ రీఎంట్రీ? రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కార్పొరేట్ రాజకీయాన్ని బెజవాడకు పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కార్పొరేట్ రాజకీయాన్ని బెజవాడకు పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఆంధ్రా ఆక్టోపస్ గా కూడా రాజగోపాల్ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్ రూపంలో ఊహించి ముందే చెప్పటంలో రాజగోపాల్ దిట్ట. రాష్ట్ర విభజన పరిణామాలు నేపథ్యంలో ఆయన రాజకీయాలను నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మరలా ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరందుకుంది. మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర అల్లుడు అయినప్పటికీ.. ఆయన రాజకీయ వారసుడిగా కాకుండా, పారిశ్రామిక వేత్తగా, ల్యాంకో అధినేతగా రాజగోపాల్ మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజగోపాల్.. ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ను బయటపెట్టి, ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఏ పార్టికీ ఎంత మెజార్టీ వస్తుందో డిపాజిట్లు కూడా దక్కని పార్టీ ఏదో అనే విషయాలను ఈవీఎం ఫలితాల కన్నా ముందే పసిగట్టి చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి.
అయితే అది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. రాష్ట్ర విభజనకు ముందు రాజగోపాల్ ఇచ్చిన ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి. 2019 ఎన్నికల ఫలితాలలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫెయిలైంది. విభజన జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి, ఇప్పటి వరకు కనిపించలేదు. విభజన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యలో రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారు.. రావాలి అంటూ బెజవాడ పార్లమెంట్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆయన పుట్టిన రోజుకు కూడా విజయవాడతోపాటుగా చుట్టు పక్కాల నియోజకవర్గాల్లోనూ పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. అంతటితో ఆగలేదు. తాజాగా లగడపాటి వైసీపీ నందిగామ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ను కలవడం, ఒక కార్యకర్త వివాహ వేడుకలో వైసీపీ నాయకులతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని, ఆయన విజయవాడ వైసీపీ పార్లమెంట్ ను ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాలను రాజగోపాల్ సన్నిహిత వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలుండగా ఈలోపు ఏమైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.