స్వపక్షంలో విపక్షం
జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ రాకముందు నుంచే ఎన్నికల కాక మొదలైంది.
దిశ ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ రాకముందు నుంచే ఎన్నికల కాక మొదలైంది. మేమే అభ్యర్ధలమనుకుంటూ ఎవరికి వారే శుభ కార్యాలు, పరామర్శలు, సేవా కార్యక్రమాల పేరుతో ప్రచారాలు మొదలెట్టేశారు. నోటిఫికేషన్ వచ్చాక వారు ప్రచారంలో ఎక్కడ తగ్గడం లేదు. పార్టీ జిల్లా నాయకత్వంతో పాటు అధిష్టానం కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నాయి. తీరా అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆశావాహులు తగ్గేదే లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో ఇంటి పోరు స్పష్టంగా కనిపిస్తుంది. అసమ్మతి వాదులను జిల్లా నాయకత్వం బుజ్జగిస్తున్నప్పటికి వారు చల్లబడలేదు. స్వపక్షంలో విపక్షంలా తయారవుతున్నారు. నాలుగు నియోజవర్గాల్లో భిన్నమైన రీతుల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. దీంతో అభ్యర్థులు ఆశావాదంతో ప్రచారాలు సాగిస్తుండగా, కార్యకర్తలు మాత్రం గందరగోళంలో పడుతున్నారు.
పాతపట్నంలో.. తారస్థాయిలో ..
పాతపట్నం టీడీపీలో అసమ్మతి తారస్థాయిలో ఉంది. అక్కడ పార్టీ అభ్యర్థిగా మామిడి గోవిందరావును ప్రకటించడంతో ఇంతవరకు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. గోవిందరావు అభ్యర్థిత్వాన్ని కలమట బాహాటంగా వ్యతిరేకించారు. మూడు దశాబ్దాలుగా తన తండ్రి కలమట మోహనరావు, తాను పార్టీకి సేవలందించుకుంటు వస్తున్నామని, పార్టీ ఇంచార్జీగా ఉంటున్న తనకు కనీసం తెలియజేయకుండా కొత్త వ్యక్తిని ప్రకటించడం పట్ల బాహాటంగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తన వర్గాన్ని కూడగట్టి సమావేశం ఏర్పాటు చేసి ఒక రకంగా తన బలనిరూ పణను చేసుకుంటున్నారు. కబ్జా కోరు, 420 కి టికెట్ ఇచ్చారని అభ్యర్థిపై కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన అనుచరులతో బల ప్రదర్శన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ర్యాలీల్లో జిల్లా పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజాగళం నిర్వహించినప్పుడు, చంద్రబాబు అరెస్ట్ సమయాల్లో ఆందోళనలకు తాము కావాలా అంటూ పార్టీ అధినాయకుడిని కూడా నిందిస్తున్నారు.
శ్రీకాకుళంలో మౌన పోరాటం..
ఈ నియోజకవర్గంలో పరిస్థితి వేరుగా కనిపిస్తుంది. గుండ అప్పల సూర్యనారాయణ వర్గం మౌన పోరాటం చేస్తూ అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ఇంతవరకు పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవిని కాదని గొండు శంకర్ ను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల గుండ వర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తమ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి అంకిత భావంతో పని చేస్తామని, తమ సేవలకు ఇదేనా తగిన గుర్తింపు అని ప్రెస్ మీట్ లు పెట్టి వాపోతున్నారు. తమకు కనీసం తెలియపరచ కుండా అసమ్మతిని ప్రోత్సహిస్తూ ఆ వర్గం నాయకునికి టికెట్ కేటాయించడం తమను అవమానించినట్లు భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, తమ అభిమానులు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తుండగా త్వరలో తమ నిర్ణయాన్ని చెబుతామని చెప్పారు. దీంతో జిల్లా పార్టీ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ గుండ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. దీంతో కొంత వరకు వేచి చూద్దామని పార్టీ పునరాలోచన చేస్తుందని స్తబ్దుగా ఉన్నారు.
ఆమదాలవలసలో తగ్గేదేలే..
ఈ నియోజకవర్గం వైసీపీ అభ్యర్ధిగా స్పీకర్ తమ్మినేని సీతారాం బరిలో ఉన్నారు. గతంలో తనకు మాటిచ్చారు.. ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా చేశారని పార్టీలోని బలమైన నాయకుడు సువ్వారి గాంధీ ఎదురు తిరుగుతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రచారం సాగిస్తున్నారు. ఇన్నాళ్లు తనని వాడుకొని మోసం చేశారని విమర్శిస్తున్నారు. అటు టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ ఇటు తమ్మినేని సీతారాం నువ్వొక సారి నేనొకసారి అని వొంతులేసుకొని పదవులు అనుభవిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇద్దరు మేనల్లుడు, మేనమామ బయటకే వేరు లోన ఒకటేనని ప్రచారం చేస్తున్నారు. ఈ తలనొప్పితో తమ్మినేనికి ఈ సారి కష్టమేనని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.
ఎచ్చెర్ల లో వేరు కుంపట్లు..
నియోజకవర్గ వైసీపీలో వెరుకుంపట్లు రాజుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ పై ఆ పార్టీ నాయకులే కొంత కాలంగా తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని జి. సిగడాం, లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో ని నాయకులు "కిరణ్ వద్దు జగన్ ముద్దు" అంటూ తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటులో ఎచ్చెర్ల మండల వైసీపీ అధ్యక్షుడు జరుగుల్ల శంకరరావు ఉండగా అతనిని కొన్నాళ్ల కిందట పదవి నుంచి తప్పించారు. శంకరరావు పై ఇటీవల హత్యా ప్రయత్నం జరగడానికి ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందని అభియోగం ఉంది. కిరణ్ పై అసమ్మతి వాదులంతా కలసి రణస్థలం మండలం నుంచి ఒక అభ్యర్థిని రెబల్‌గా నిలబెడుతున్నట్లు సమాచారం. బుధవారం వీరంతా కలిసి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిసింది.