వైసీపీలో గందరగోళ పరిస్థితులు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతున్నాయా?
గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఎన్నో హామీలిచ్చారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో చూపిస్తానని, ప్రజల సంక్షేమం కోసం పాటు పడతానని.. ఇలా ఎన్నో హామీల వర్షం కురిపించారు.
అభ్యర్థుల చేర్పు మార్పులతో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయా ? సీట్లు కోల్పోయిన, స్థాన భ్రంశానికి గురైన నేతలు అలకబూనారా ? చివరి క్షణంలో అధిష్టానం సీట్లు తమకే కేటాయిస్తుందనే దింపుడు కల్లం ఆశలో ఉన్నారా ? అధిష్టానం అప్పటికీ స్పందించకుంటే రెబల్ గా బరిలోకి దిగేందుకు నేతలు సన్నద్ధమౌతున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు అభ్యర్థుల మార్పు చేర్పులు నేతలను పార్టీకి దూరం చేస్తుంటే మరి కొందరు బీ ఫారం ఇచ్చేలోపు సీట్లు తమకే ఇచ్చేలా చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అది ఫలించకుంటే రెబల్ గా బరిలోకి దిగే యోచనలోనూ ఉన్నారు.
దిశ, కర్నూలు ప్రతినిధి: గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ఎన్నో హామీలిచ్చారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో చూపిస్తానని, ప్రజల సంక్షేమం కోసం పాటు పడతానని.. ఇలా ఎన్నో హామీల వర్షం కురిపించారు. కానీ అధికారం చేపట్టి ఐదేళ్ల ముగింపు దశకు చేరుకున్నా అనేక హామీలు నెరవేర్చలేదు. తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ నేరుగా ప్రజల్లోకెళితే గెలుపు కష్టమని భావించారు. తెలంగాణ ఫలితాల నేపథ్యంలో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చడం, కొత్తవారికి అవకాశం కల్పించడం, మరి కొన్ని చోట్ల సిట్టింగులకు స్థాన భ్రంశం కల్పించడం వంటి చర్యలు చేపట్టారు. తమకు కాకుండా ఇతరులకు సీట్లు కేటాయించినా ఇంకా రెండు నెలల సమయం ఉందని, బీ ఫారం ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చిన సందర్భాలు న్నాయని, ఆలోపు అధిష్టానం తమ పట్ల సానుకూలంగా స్పందించకపోదా అనే ధీమాలో నేతలున్నారు. అప్పుడు కూడా స్పందించకుంటే రెబల్ గా గానీ, ఇతర ఇతర పార్టీలో చేరి గానీ సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేసేందుకు అలక నేతలు సన్నద్ధమౌతున్నారు.
దింపుడు కల్లం ఆశలు..
వైసీపీ ఇప్పటికి మూడు జాబితాల్లో 59 మందిని ఇన్చార్జులుగా నియమించింది. కొందరు నేతలు టికెట్ దక్కకపోయినా ఆఖరి ఆశలతో ఊగిసలాడుతున్నారు. పిఠాపురం, ఒంగోలు, కర్నూలు, అరకు, ఆలూరు, కోడుమూరు వంటి నియోజక వర్గాల్లో స్థానిక నాయకత్వం అధిష్టానం ఆలోచనకు భిన్నంగా నడుస్తోంది. ఇంచార్జులు వేరు.. బీ ఫారం వేరు అనే ధీమా వీళ్లలో ధైర్యం నింపుతోంది. పిఠాపురం వైసీపీ టికెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికీ ధీమాతో ఉన్నారు. ఆ స్థానంలో వైసీపీ అధిష్టానం వంగా గీతను ఇంచార్జిగా నియమించింది. కానీ ఇంచార్జులు, కో-ఆర్డినేటర్లందరూ అభ్యర్థులు కాబోరంటూ దొరబాబు హైకమాండ్‌ను ఇరకాటంలో పడేస్తున్నారు. క్యాడర్ నాతోనే ఉంది.. ప్రజల ఆకాంక్ష మేరకు తనకు జగన్ అవకాశం ఇచ్చే తీరుతారంటూ భరోసాతో ఉన్నారు.
బాలినేని ద్వారా లాబీయింగ్..
ఇక ఒంగోలు ఎంపీ స్థానంపై సస్పెన్స్ పీక్స్‌లో నడుస్తోంది. మూడో జాబితాతోనే ఈ ఉత్కంఠకు తెర పడుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టిక్కెట్ నిరాకరించవచ్చన్న వార్తలతో లాబీయింగ్ షురూ అయింది. మాజీ మంత్రి బాలినేని ద్వారా పావులు కదుపుతోంది మాగుంట వర్గం. సిట్టింగ్‌ను మార్చవద్దని, మాగుంటను మళ్లీ గెలిపించుకుంటా మని అధిష్టానానికి నచ్చచెప్పే ప్రయత్నం బాలినేని చేస్తున్నారు.
గుర్రుగా ఉన్న గుమ్మనూరు..
కర్నూలు ఎంపీ టికెట్ దక్కించుకున్న ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా అధిష్టానం నిర్ణయంతో పూర్తిగా సంతృప్తిగా లేరు. ఎమ్మెల్యేగా పోటీలో ఉండడమే తమ అభిమతమని చెబుతున్నారు. ఇంకా రెండు నెలల టైముంది..చూద్దాం ఏం జరుగుతుందో..బీ ఫారం దాకా వేచి చూద్దామని అంటున్నారు. అప్పటికీ అధిష్టానం స్పందించకుంటే రెబల్ గా బరిలో దిగేందుకు సన్నద్ధమౌతున్నారు.
మాధవీ.. గో బ్యాక్..
వైసీపీ మూడో జాబితాలో అరకు ఇంచార్జిగా గొడ్డేటి మాధవి పేరు ప్రకటించింది. ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్న మాధవిని..అరకు ఎమ్మెల్యే సెగ్మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసింది. కానీ ఆమెకు సహకరించేది లేదని తేల్చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ. ఎమ్మెల్యేకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి ‘మాధవి గో బ్యాక్’ అంటూ వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. టిక్కెట్ కోసం చివరి క్షణం వరకు పోరాడతానని ఓపెన్‌గా చెబుతున్నారు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ. వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రి సోదరుడికీ ఎదురుగాలి..
కోడుమూరు నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ను కాదని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ ను ఇంచార్జిగా నియమించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కొండపికి బదిలీ చేశారు. కొండపిలో ఓటమి తప్పదని అనుమానించిన సురేశ్, తన సోదరుడైనా గెలుస్తాడనే ఆశతో పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించుకున్నట్లు సమాచారం. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ నాయకులు సతీశ్ ను ఇంచార్జిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. అధిష్టానం నుంచి ఇంచార్జుల జాబితా రిలీజవుతున్నా.. కొన్నిచోట్ల నేతలు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఏమో..అధిష్టానం మనసు మారినా మారొచ్చు..అంటూ దింపుడు కల్లం ఆశలతో నేతలు ముందుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి మార్పు చేర్పులుంటాయో వేచి చూడాల్సిందే.