టీడీపీకి బిగ్ షాక్.. కేంద్ర పెద్దలకు ఏపీ బీజేపీ నేతల కీలక లేఖ

గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించడమేంటీ! అంతకన్నా బలమైన నేతలు పార్టీలో ఉన్నా సీటు ఎందుకు కేటాయించడం లేదు? అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్​ రెడ్డితో పాటు పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-03-18 03:23 GMT

అలా పొత్తు ఖరారైందో లేదో.. ఇలా ప్రతిపక్ష కూటమి పార్టీల్లో అలకలు మొదలయ్యాయి. తెలుగు దేశం పార్టీ కోవర్టులకే సీట్లు ఇప్పించుకున్నారంటూ కమలనాథులు ఆరున్నొక్కరాగం అందుకున్నారు. ఏకంగా ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు. మరోవైపు బీజేపీ నుంచి బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపేట్లు వైసీపీ పావులు కదుపుతోంది. దీనికి సంబంధించి ఓ బీజేపీ నేత వైసీపీ ఎంపీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కమలనాథులతో పొత్తు ఎక్కడకు దారితీస్తుందోనంటూ విపక్ష కూటమి శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించడమేంటీ! అంతకన్నా బలమైన నేతలు పార్టీలో ఉన్నా సీటు ఎందుకు కేటాయించడం లేదు? అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్​ రెడ్డితో పాటు పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి బలం లేని సీట్లు కేటాయిస్తోందని వాపోతున్నారు. దీనిపై జేపీ నడ్డాకు ఓ లేఖ రాశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకొని లోతుగా పరిశీలించాలని అధిష్టానానికి విన్నవించారు. ఓవైపు కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ తలబొప్పి కట్టిస్తోంది. దీనికితోడు కొందరు కాషాయ పార్టీ నేతలు అభ్యర్థుల ఎంపికలో అన్యాయం జరుగుతోందంటూ రోడ్డెక్కడంతో టీడీపీ, జనసేన శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

ఆ స్థానాలపై వైసీపీ ఫోకస్..

ఇంకోవైపు బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులు నిలిపేట్లు వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటిదాకా బీజేపీలో తమకు అనుకూలంగా ఉన్న నేతలతో అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై హైదరాబాద్​లో ఓ బీజేపీ నేత వైసీపీ ఎంపీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ పోటీ చేసే స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు వైసీపీ అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తోంది. ఉత్తరాంధ్రలో కొన్ని స్థానాల్లో జనసేన నుంచి దీటైన అభ్యర్థులను పెట్టలేదని తెలుస్తోంది. అలాంటి నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్​ పెట్టింది.

టీడీపీ, జనసేనకు సమస్యలు తప్పవా?

గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీకి ప్రస్తుతం బలం పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నిలువునా మోసం చేసిందని సగటు ప్రజలు భావిస్తున్నారు. ఇంకా ధరల పెరుగుదల, నిరుద్యోగం విషయంలో బీజేపీ మీద వ్యతిరేకత పెరిగింది. బీజేపీ సెగ టీడీపీ, జనసేనకు తగులుతుందని ఆయా పార్టీల శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. నష్టాన్ని భరించడానికి సిద్దపడినా బీజేపీ నేతల తీరు టీడీపీ, జనసేన నేతలకు కొత్త సమస్యలు సృష్టించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More..

కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం.. ఆ స్థానం నుంచి ఎంపీగా షర్మిల పోటీ!  

Tags:    

Similar News