ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా నేను సిద్ధం: మంత్రి జోగి రమేశ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇన్‌చార్జిల మార్పుపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఇన్‌చార్జిల మార్పుపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సబబేనని చెప్పుకొచ్చారు. గత రెండేళ్లుగా ప్రజల్లో ఉండాలని.. ప్రజామోదం కలిగిన నాయకులకే టికెట్లు ఇస్తానని సీఎం వైఎస్ జగన్ పదేపదే చెప్తున్నారని అన్నారు. ఓడిపోయే వాళ్లకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం జగన్ తేల్చి చెప్తున్నారని అందులో తప్పేమీ లేదన్నారు. మరోవైపు తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ కోసం నిలబడతానని తెలిపారు. జోగి రమేశ్ సమర్థుడని సీఎం వైఎస్ జగన్ భావిస్తే తనకు టికెట్ ఇస్తారని అన్నారు. పెడన నుంచే మళ్లీ పోటీ చేయమంటే చేస్తామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. లేదు మైలవరం నుంచి పోటీ చేయమంటే చేస్తానని రెండూ వద్దు వేరేచోట పోటీ చేయాలని భావిస్తే తాను అక్కడకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటామని జోగి రమేశ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కలేని వారు ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదని చెప్పుకొచ్చారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయం అని అందుకు తామంతా కట్టుబడి పనిచేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.