శ్రీవారి ఆలయంలో అపశృతి.. కిందజారిపడిన కానుకల హుండీ

తిరుమల శ్రీ వారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారి హుండీ ఆలయ ముఖ ద్వారం వద్ద కిందజారి పడిపోయింది.

Update: 2023-07-06 09:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీ వారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారి హుండీ ఆలయ ముఖ ద్వారం వద్ద కిందజారి పడిపోయింది. భక్తులు సమర్పించిన కానుకలతో కూడిన హుండీని ఆలయం నుంచి పరకామణి మండపానికి తరలిస్తుండగా మహాద్వారం దగ్గర హుండీ కిందపడిపోయింది. దీంతో భక్తులు వేసిన కానుకలు అన్నీ నేలపాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీ ద్వారా లారీలోకి ఎక్కించారు. అనంతరం హుండీని లారీలో పరకామణి మండపానికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడి పోయినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుండీ కిందపడిపోవడాన్ని భక్తులు అపచారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు. అంతేకాదు భారీగా శ్రీవారికి కానుకలు సైతం సమర్పించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. డబ్బులు, బంగారం, ఇతర వస్తువల రూపంలో భక్తులు కానుకలు సమర్పిస్తారు. శ్రీవారి హుండీని కూడా భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు హుండీ కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ నిండిన తర్వాత ఆలయం వెలుపలికి తీసుకువచ్చి లారీలో పరకామణికి తీసుకువెళతారు. ఇలా హుండీని పరకామణికి తీసుకువెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Tags:    

Similar News