అన్నా క్యాంటీన్‌కి భారీ విరాళం.. సీఎం చంద్రబాబు స్పెషల్ ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే రంగారావు సతీమణి డాక్టర్ నార్నే శాంతారావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే రంగారావు సతీమణి డాక్టర్ నార్నే శాంతారావు ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కలిశారు. ఈ సందర్భంగా ఆమె.. అన్నా క్యాంటీన్ (Anna Canteen) కు భారీ విరాళం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. అన్నా క్యాంటీన్ కు విరాళం ఇవ్వడంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara bhuvaneshwari) తనకు స్పూర్తి అని నార్నే శాంతారావు (Dr. Narne Shantha Rao) అన్నారు.
దీనిపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్, చైర్మన్ నార్నే రంగారావు (Narne Rangarao) జ్ఞాపకార్థం.. ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు నార్నే ‘అన్న క్యాంటీన్’కు రూ.1,00,01,016 విరాళంగా అందజేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారం చేపట్టాక ‘అన్న క్యాంటీన్’ తిరిగి ప్రారంభించిన సమయంలో నారా భువనేశ్వరి రూ. 1 కోటి విరాళంగా ఇచ్చి తనకు స్ఫూర్తి నింపారని డాక్టర్ శాంతారావు అన్నారని తెలిపారు. అనారోగ్యం కారణంగా చనిపోవడానికి ఒకరోజు ముందు రూ. 1 కోటి విరాళం అందించే విషయాన్ని నార్నే రంగారావు.. డాక్టర్ శాంతారావు గారికి గుర్తుచేశారని చెప్పారు.
దీంతో ఆయన మరణానంతరం తన కుమార్తె, నార్నె ఎస్టేట్స్ డైరెక్టర్ (Narne Estates Director) అడుసుమిల్లి దీప (Adusumilli Deepa), వైట్ ఫీల్డ్ బయో ఎండీ అడుసుమిల్లి నరేష్ కుమార్‌తో కలిసి వచ్చి శాంతారావు ఈ విరాళాన్ని సీఈవో నార్నె గోకుల్ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారని వెల్లడించారు. పేదలకు రూ. 5 లకే అన్నం పెట్టాలనే ఆలోచనకు.. ఇలాంటి వారి మంచి మనసు ఎంతో దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఎంతో నిజాయితీగా, ఆదర్శంగా జీవితాన్ని గడిపిన నార్నే రంగారావు కాలం చేయడానికి ఒక రోజు ముందు కూడా అన్న క్యాంటీన్ విరాళం గురించి భార్యకు గుర్తు చేయడం వారి గొప్ప మనసుకు నిదర్శనమని కొనియాడారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ.. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నానని టీడీపీ అధినేత అన్నారు.