Home Minister Anita:గత ప్రభుత్వం పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగికదాడి(sexual assault) ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని హోం మంత్రి అనిత(Home Minister Anita) మండిపడ్డారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగికదాడి(sexual assault) ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని హోం మంత్రి అనిత(Home Minister Anita) మండిపడ్డారు. తిరుపతి జిల్లాలోని వడమాలపేట లో చిన్నారిపై లైంగిక దాడి(sexual assault) ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరు ఖండించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు(ఆదివారం) హోం మంత్రి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం హోంమంత్రి అనిత(Home Minister Anita) మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్, సీసీ కెమెరాల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆమె మండిపడ్డారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి అధికార పార్టీ పై అవాకులు, చవాకులు పేలిన వైసీపీ నేతలు షర్మిల వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలకు అండగా ఉంటామని చెబుతున్న ఆ నాయకులంతా అన్న జగన్ చేతిలో మోసపోయిన షర్మిలకు అండగా ఎందుకు నిలబడలేదని హోం మంత్రి అనిత విమర్శించారు. ఆ పార్టీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాంధులు రెచ్చిపోయిన ప్రతి చోటకు చేరి వారిపై అఘాయిత్యాలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గంజాయి సాగు అరికట్టేందుకు డ్రోన్‌లు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక కిట్లు అందుబాటులోకి రానున్నట్లు ఆమె తెలిపారు.