‘ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?’.. ఆ ఫొటో చూపిస్తూ హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh) శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి అనిత(Home Minister Anitha) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. పిల్లలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందని హోం మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, హెల్మెట్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించడం జరుగుతుంది అన్నారు. 'హెల్మెట్' విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం. ప్రాణమా? వెయ్యి రూపాయాలా? అన్న సున్నితత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు.
పౌరుల్లో మార్పు కోసమే రూ.100ను రూ.1000కి పెంచింది. మనమెంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి అజాగ్రత్త వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హెల్మెట్ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రం, సుప్రీం మార్గదర్శకాలను అమలు చేయక తప్పదు అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారి భద్రతా మండళ్లు సంయుక్తంగా సభ్యులు ఏడాదికి రెండు సార్లు ముఖ్యమంత్రి, రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రి, డీజీపీలు సమీక్షిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి నెలా, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీతో కలిసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
రోడ్లు, భవనాలు, రవాణా, విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహణ 961 బ్లాక్ స్పాట్లను గుర్తించి, 1117 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 2021-2024 వరకు జరిగిన ప్రమాదాలు సగటున ఏడాదికి 7 వేల పైన ఘోర రోడ్డు ప్రమాదాలు 2024లో, 6,902 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సాధారణ ప్రమాదాల సంఖ్య ఏడాదికి 10 వేల పైనే జరిగాయి. హెల్మెట్ లేకపోవడం వల్లే 2021లో 2,577 మంది మృతి 2022లో 3042 మంది, 2023లో 3,108 మంది, 2024లో 3,400 మంది చనిపోయారు.
హెల్మెట్ తప్పనిసరి అనేది అన్ని చోట్ల అమలు చేయాలని తెలిపారు. తల్లిదండ్రుల కోణంలో ఆలోచిస్తే ఆ బాధ తీవ్రత తెలుస్తుందని.. రూ.లక్ష పెట్టి బండి కొంటారు..హెల్మెట్ మాత్రం కొనరు అంటూ హోం మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్కూటీ మీద నలుగురు ఆడపిల్లలు ప్రయాణం చేస్తున్న ఫోటోను హోంమంత్రి అనిత సభలో చూపించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? బండి కొని పిల్లలకి ఇవ్వాలంటే భయపడే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు.