‘మీకు నచ్చితేనే చేయండి’.. యాంకర్ ప్రదీప్ కీలక వ్యాఖ్యలు
విద్యార్థులు ఏదైనా పనిని ప్రారంభించే ముందు మీకు నచ్చితేనే చేయండని యాంకర్, యాక్టర్, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి ప్రదీప్ మాచిరాజు అన్నారు.

దిశ ప్రతినిధి, గుంటూరు: విద్యార్థులు ఏదైనా పనిని ప్రారంభించే ముందు మీకు నచ్చితేనే చేయండని యాంకర్, యాక్టర్, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి ప్రదీప్ మాచిరాజు అన్నారు. స్థానిక గుంటూరు రూరల్ మండలం పలకలూరులోని విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి టెక్ ఒడిస్సీ, కల్చరల్ కాస్కేడ్, క్రియేటివ్ కాన్వస్, వర్డ్ సింఫణీ, బిజినెస్ పరేడ్, చిల్ థ్రిల్, స్పోర్ట్స్ ఫెస్ట్ ‘‘ నిరులోత్సవ్–2కే25’’ను శనివారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యాంకర్, యాక్టర్, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఏం సాధించాలన్నా ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. అవి ఉంటేనే విజయం మీ సొంతమవుతుందన్నారు.
విజ్ఞాన్స్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తిచేసి.. ఇక్కడికే ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా విద్యార్థినుల్లో సవాళ్లను అధిగమించే సామర్థ్య లక్షణాలు ఉంటాయని.. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారన్నారు. వచ్చేనెల ఏప్రిల్ 11న తను నటించిన ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ సినిమా విడుదల అవుతుందని, సినిమాను అందరూ ఆదరించి అఖండ విజయం అందించాలని విద్యార్థులను కోరారు. ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు. ఈ సినిమా తన మనసుకు బాగా దగ్గరైన సినిమానని తెలియజేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమైనదని తెలియజేశారు.
సాంకేతికత నిరంతరం మారిపోతుంది..
కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన కాడెన్స్ ఇన్వెకాస్ డైరెక్టర్ నల్లపనేని మాధురి మాట్లాడుతూ సాంకేతికత నిరంతరం మారిపోతుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఫైటింగ్ స్పిరిట్, ఫ్లెక్సిబుల్ మైండ్‌సెట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడు లెర్నింగ్ ప్రక్రియను ఆపకూడదన్నారు. విద్యార్థులు ఏదైనా పనికి ఎక్కువ సమయాన్ని కేటాయించే బదులు.. అదే పనిని ఇష్టంగా, అభిరుచితో చేయాలన్నారు. మీ కలల సాకారానికి అంకితభావంతో కృషి చేస్తే ఉన్నతంగా ఎదిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని అన్నారు. ఇది సాధించలేనేమో అనే భయం, సందేహాలకు జీవితంలో తావివ్వొద్దని సూచించారు.
క్రియేటివిటీకి టెక్నాలజీ జోడించాలి..
వినూత్న ఆలోచనలకు కాసింత క్రియేటివిటీ, టెక్నాలజీని జోడించి ఉపయోగించుకుంటే జీవితంలో విద్యార్థులు ముందుకు దూసుకెళ్లి పోవచ్చని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? బృంద సమూహంగా ఎలా పని చేయాలనే విషయాలు తెలుస్తాయన్నారు. ప్రతి విద్యార్థి కూడా సామాజిక, మానసిక, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలన్నారు.
నిరులోత్సవ్– 2025 విజేతలకు బహుమతులు
జాతీయ స్థాయి విజ్ఞాన్ నిరులోత్సవ్‌లో భాగంగా మొత్తం 45 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విలువైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను, సర్టిఫికెట్లను అందించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సినిమా హీరోయిన్ దీపిక పిల్లి, ఎస్‌బీఐ మేనేజర్ కే.ప్రియాంక, విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, నిరుల ప్రిన్సిపల్ డాక్టర్ పాతూరి రాధిక, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.