మళ్లీ ఆయనకే వైసీపీ పగ్గాలు.. సీఎం జగన్ పునరాలోచన
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (విసారె)కి మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (విసారె)కి మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి దీటుగా దిశా నిర్దేశం చేయలేకపోయారని సీఎం భావించినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల ప్రకటనలు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు గ్రహించారు. చంద్రబాబు ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశముందనే సజ్జల వ్యాఖ్యలపై మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భిన్నంగా స్పందించారు. తాజాగా బాలినేని ఎపిసోడ్‌తో పార్టీకి సరైన మార్గనిర్దేశనం చేయడానికి విజయసాయి రెడ్డి అయితేనే సమర్థుడని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత విజయసాయి రెడ్డి స్తబ్దుగా మారిపోయారు. గతంలో మాదిరి దూకుడుగా వ్యవహరించడం లేదు. నందమూరి తారకరత్న మృతి సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా మెలగడాన్ని కూడా పార్టీ వర్గాలు అనుమానించాయి. దీంతో ఆయన ట్విట్టర్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడడాన్ని తగ్గించారు. సాదాసీదా పోస్టులకే పరిమితమవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వ్యవహారాలన్నీ విసారె చక్కదిద్దే వారు. ఏ నాయకుడు అలకబూనినా.. అసంతృప్తి వ్యక్తం చేసినా ఎంతో ఓపిగ్గా బుజ్జగించే వారు. నేతల మధ్య విభేదాలను సమన్వయం చేస్తూ పార్టీని ఏకతాటి మీద నడిపారు.
సజ్జల తప్పటడుగులు..
విసారె తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఘటనలపై పార్టీ నేతలు ఎలా స్పందించాలనే దానిపై తగు సూచనలు ఇస్తున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ జయంతి ఉత్సవంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ప్రశంసలు కురిపించారు. దీంతో వైసీపీ నేతలంతా రజనీకాంత్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ నేతల విమర్శలకు రజనీ ఘాటుగా స్పందించారు. అవసరమైతే టీడీపీ తరపున ఏపీలో పోటీ చేస్తానని ప్రకటించడంతో వైసీపీ మరింత డిఫెన్స్‌లో పడాల్సి వచ్చింది. రజనీకాంత్‌ను కెలుక్కొని లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నట్లు పార్టీ అధిష్ఠానం భావించింది.
సజ్జల వ్యాఖ్యలపై బొత్స ఆక్షేపణ..
గత టీడీపీ ప్రభుత్వంపై సిట్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశముందని సజ్జల వ్యాఖ్యానించారు. దీనిపై పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భిన్నంగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు దాన్ని అనుకూలంగా మల్చుకొని సానుభూతి పొందే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. సజ్జల ఎందుకు అలా వ్యాఖ్యానించారో తనకు తెలియదని అన్నారు.
చేతులు కాలకముందే..
నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ప్రకాశం జిల్లాలో బాలినేని ఎపిసోడ్ సీఎం జగన్‌ను మరింత కలవరపెట్టింది. బాలినేని, వైవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు పార్టీకి మరింత నష్టం చేసే అవకాశాలున్నాయని భావించారు. అందుకే పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతను తిరిగి విజయసాయిరెడ్డికి అప్పగించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Read more:
కూతురు v/s తండ్రి.. ఉదయగిరిపై వైసీపీ వ్యూహం అదేనా?
విద్యారంగంలో సంస్కరణలు సత్ఫలితాలు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి