అమూల్ పాల షాపులపై ప్రభుత్వం ఫోకస్..
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వేల సంఖ్యలో అమూల్ ఉత్పత్తుల అమ్మకాల బడ్డీలను ఒక విధానం అంటూ ఏమీ లేకుండా ఇష్టానుసారం ఏర్పాటు చేయించింది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని ముఖ్యమైన కూడళ్లలో ప్రభుత్వ స్థలాలు, రహదారి మార్జిన్‌లలో యథేచ్ఛగా వీటిని మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. వీటివల్ల స్ధానికులు ఇబ్బంది పడుతున్నా, ట్రాఫిక్ సమస్యలు ఎదురౌతున్న, పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వ దుకాణాల పేరిట అధికారులు ఎవ్వరూ వీటి జోలికి వెళ్లలేదు.
వైసీపీ నేతల చేతుల్లోనే..
ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పూర్తిగా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేతుల్లో వారు సిఫార్సు చేసిన వారి చేతుల్లో ఉన్న ఈ దుకాణాలను ఏం చేయాలన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. గతంలో రహదారుల పక్కన బడ్డీలు ఏర్పాటు చేసుకుని పాలు విక్రయించే సామాన్యులు దరఖాస్తు చేసినా పట్టించుకోకుండా కేవలం వైసీపీ సిఫార్సులకే అముల్ బడ్డీల ఏర్పాటులో ప్రాధాన్యతనిచ్చారు. కీలకమైన ప్రాంతాల్లో ప్రభుత్వ స్ధలాల్లోనే అముల్ బడ్డీలు ఏర్పాటు చేయడంతో వ్యాపారం కూడా ఈ మూడేళ్లలో బాగానే సాగింది.
నగరాల్లో పెద్ద సమస్యగా అమూల్ బడ్డీలు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమూల్ దుకాణాల ఏర్పాటును ప్రభుత్వమే ప్రోత్సహించడంతో ఒక విధానమంటూ ఏమీ లేకుండా ఇష్టానుసారం, అడ్డదిడ్డంగా వీటిని ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, జనసమ్మర్థం ఎక్కువగా వుండే ప్రాంతాలు, ఆస్పత్రులు, మార్కెట్ లు వద్ద రహదారి మార్జిన్‌లలో వీటిని పెట్టేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం అభ్యంతరాలను, ప్రజల ఫిర్యాదులను పట్టించుకోకుండా ఏర్పాటు చేశారు. గతంలో బడ్డీలు తొలగించిన పలు ప్రాంతాల్లో అముల్ దుకాణాలు వెలిశాయి. మిగిలిన వ్యాపార సంస్థలకు, బడ్డీలకు వర్తించే నిబంధనలు అముల్ స్టాల్ లకు లేకపోవడంతో ఇబ్బందికరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా అధికారులు జోక్యం చేసుకోలేదు.
వీటి ఆధారంగా మరికొన్ని..
ఎటువంటి బడ్డీలకు అవకాశం లేని రహదారి మార్జిన్‌లలో, ఫుట్ పాత్ లపై అమూల్ దుకాణాలను ఏర్పాటు చేయడంతో మరికొందరు వైసీపీ నేతల అండదండలతో పాన్ షాప్ లు, టీ స్టాల్ లు వంటి వాటిని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నగరాలు, పట్టణాల్లో రహదారి అక్రమాలకు అమూల్ స్టోర్ ఆధారమైంది. ఆ స్టోర్ల పక్కన వెలసిన బడ్డీలను తొలగిస్తే అముల్ స్టోర్‌ను తొలగించాల్సి వస్తుందన్న భయంతో అధికారులు వీటి జోలికి పోలేదు. దీంతో రోడ్డు పక్కన పలు నగరాలు, పట్టణాల్లో విపరీతంగా బడ్డీలు వెలిశాయి.
ఏం చేద్దాం?
గత ప్రభుత్వం అముల్ సంస్థతో చేసుకొన్న ఒప్పందం తో పాటు వేల సంఖ్యలో రాష్ర్ట వ్యాప్తంగా వున్న ఈ బడ్డీలను ఏం చేయాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వీటిపై ఒక నివేదిక తెప్పించుకుని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని యోచిస్తోంది. రహదారులు, ఫుట్‌పాత్‌లకు ఇబ్బందికరంగా వున్న బడ్డీలను తొలగించాలని ప్రాథమికంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.