Minister Narayana:ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. నేడు(బుధవారం) ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాయణ టిడ్కో ఇళ్ల పై సమాధానం ఇచ్చారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. నేడు(బుధవారం) ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాయణ టిడ్కో ఇళ్ల పై సమాధానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు. గత ప్రభుత్వం మాపై కక్షతో లబ్దిదారుల పట్ల దారుణంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు లక్షల 1480 ఇళ్లకు కేంద్రం నుంచి అనుమతి తీసుకుని 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చాం అని గుర్తు చేశారు. వీటిలో 3,13,832 ఇళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రౌండ్ అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో మొత్తం 5 లక్షల ఇళ్లలో 2లక్షల 38 వేల 360 ఇళ్లను రద్దు చేసి కేవలం 2 లక్షల 61 వేల 660 ఇళ్లు మాత్రమే టేకప్ చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పేదవారికి సైతం గేటెడ్ కమ్యూనిటీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించడంతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హైక్వాలిటీతో హైటెక్నాలజీ గత షీర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల కోసం నిర్మించే ఇళ్లకు టేక్ వుడ్ తో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసాం అని తెలిపారు. కిచెన్ లో స్టెయిన్ లెస్ స్టీల్ సింక్, అటకలు, కప్ బోర్డులు, ఏ గ్రేడ్ వర్టిఫైడ్ టైల్స్ తో ఫ్లోరింగ్, స్టీల్ విండోస్, కమ్యూని టీ హాల్,లిఫ్ట్,అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌తో పాటు ఇళ్ల మధ్య పెద్ద పెద్ద రోడ్లు ఉండేలా నిర్మాణం చేపట్టాం అని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వంలో ఎంపిక చేసిన మూడు లక్షల 80వేల మంది లబ్దిదారులలో చాలామందిని గత వైసీపీ ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. ఇలా తొలగించిన లబ్దిదారులకు వారు చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉందని మండిపడ్డారు. ‘మరోవైపు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 540 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. టిడ్కో ఒక్కో ఏరియాలో ఒక్కో కలర్ వేసాం. కానీ రంగులు మార్చడం కోసం 300 కోట్లు వృధా చేసిందన్నారు. అయితే టిడ్కో లబ్దిదారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌళిక వసతులు కల్పనకు 5200 కోట్లు ఖర్చవుతుందన్న మంత్రి.. త్వరలోనే పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని’ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.