హైకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిటిషన్.. ప్రతివాదులకు నోటీసులు

టీటీడీ పై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేయడంపై మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు....

Update: 2024-09-23 10:38 GMT

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ(TTD)లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేయడంపై మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టు (Ap High Court)లో సవాల్ చేశారు. టీటీడీపై విచారణ జరిపే అధికారం విజిలెన్స్‌కు లేదని పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి (Yv Subbareddy) తరపున వాదనలు వినిపించారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అని, అటువంటి సంస్థపై విచారణ చేయాలంటూ కనీస కారణాలు చూపాలని కోర్టుకు వివరించారు. రాజకీయ ప్రమోజనాల కోసమే విజిలెన్స్ విచారణను తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డికి ఆగస్టు నెలలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ విభాగం నోటీసులు జారీ చేసింది. శ్రీవారి ట్రస్ట్ నిధులను ఆలయాల నిర్మాణాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించారనే ఆరోపణలపై అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్‌అండ్‌బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో నిబంధనలు పాటించలేదని తేలింది. దీంతో టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు నిర్వహించారు. గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీశారు. అయితే టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దృష్టికి రావడంతో వైవీ సుబ్బారెడ్డితో పాటు కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవోలు జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీకి నోటీసులు జారీ చేశారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.


Similar News