లడ్డూ వివాదం.. శ్రీవారి ఆలయం ఎదుట భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం
లడ్డూ వివాదంపై శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ వివాదం (Srivari Laddu Issue)పై విమర్శలు వెల్లువెత్తిన వేళ తిరుమల (Tirumala)లో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలు వినియోగించారనే ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Former Chairmen Bhumana Karunakar Reddy) సీరియస్ అయ్యారు. తాము ఏ తప్పు చేయలేదని తిరుమల శ్రీవారి ఆలయం ముందు అఖిలాండం వద్ద కర్పూరం హారతి వెలిగించి ప్రమాణం చేశారు. పుష్కరిణిలో స్నానం చేసి మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా దేవుడిపై భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) కావాలనే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తమపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలకు దమ్ముంటే శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలని భూమన సవాల్ విసిరారు.
ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకుండా ఉండేందుకే లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో స్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు అయినా ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదనే తమపై నిందలు వేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.