టీడీపీ,జనసేన, వామపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు చేయండి : చంద్రబాబుకు సీపీఐ నారాయణ సూచన
బీజేపీతో పొత్తుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఊగిసలాట ధోరణి మానుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీతో పొత్తుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఊగిసలాట ధోరణి మానుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు. ఢిల్లీలో బుధవారం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయని అందులో ఎలాంటి సందేహమే లేదన్నారు. మరోవైపు బీజేపీ జనసేనతో కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ గ్రహించాలన్నారు. బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు నాయుడు ప్రయత్నించాలని సూచించారు. వైసీపీ, బీజేపీ పార్టీలు ఎప్పటికీ కలిసే ఉంటాయని.. విడిపోయేలా భ్రమ కల్పిస్తారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీని ఓడించే శక్తి, సత్తా బీజేపీకి లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. అలాంటి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించడం సహేతుకం కాదన్నారు. ఇకనైనా చంద్రబాబు సీపీఐ, సీపీఎం, జనసేనతో ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయనన్నారు. ఈ కూటమి దెబ్బకు వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజిన్ ఫెయిల్ అవ్వడం ఖాయమన్నారు. మరోవైపు చంద్రయాన్-3 విజయాన్ని బీజేపీ తమ ఖాతాలో వేసుకుందని చెప్పుకొచ్చారు. ఈ విజయంతోనే బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిందన్నారు. చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టి ఓ మతాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు టీటీడీ పాలక మండలిలో మద్యం వ్యాపారులకు చోటు ఇవ్వడంపై మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ వెనక్కి తీసుకోవాలని సూచించారు. మాంసం అమ్మేవారిని, లిక్కర్ అమ్మేవారిని తిరుమల కొండపైకి పంపించారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.