భార్యకు సీమంతం..ఫ్రెండ్స్‌కి యూట్యూబర్ పార్టీ?: ఫిషింగ్ హార్బర్ ఘటనలో పోలీసుల అదుపులో 9 మంది

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోతైన విచారణ జరిపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Update: 2023-11-20 08:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోతైన విచారణ జరిపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 9మంది అనుమానితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై అనుమానితుల నుంచి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తొమ్మిది మందిలో ఫేమస్ యూట్యూబర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫేమస్ యూట్యూబర్ సతీమణికి ఆదివారం ఘనంగా శ్రీమంతం ల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఫేమస్ యూట్యూబర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న యూట్యూబర్ భార్యకు ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్స్ పార్టీ అడిగారని తెలుస్తోంది. దీంతో ఫిషింగ్ హార్బర్‌లో స్నేహితులకు మందు పార్టీ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఆ సమమయంలోనే అగ్నిప్రమాదం జరిగిందని అంటున్నారు. అయితే బోటుకు మంటలు ఎలా వ్యాపించాయి అన్నది పోలీసులతోపాటు స్థానిక మత్స్యకారులకు సైతం మిస్టరీగా మారింది.

ప్రమాదంపై భిన్న కథనాలు

ఇటీవలే దీపావళి వేడుక జరిగింది. నాడు మిగిలిన క్రాకర్స్‌ను పార్టీ తర్వాత కాల్చినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు పార్టీలో పాల్గొన్న వారు వంట చేస్తుండగా మంటలు అంటుకుని ప్రమాదం సంభవించిందని మరో ప్రచారం జరుగుతుంది. ఇలా రెండు ప్రచారాలు జరుగుతున్నాయి. మంటలు అంటుకున్న బోటుకు లంగరు వదిలేయడంతో ఆ బోటు జట్టి నెంబర్‌ 1లో బోట్ల దగ్గరకు చెరుకుందని ఫలితంగా భారీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రమాదం జరిగిన సమయంలో యూట్యూబర్ అక్కడే ఉండే వీడియో తీసి అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే ఈ ఘటనలో దగ్థమైన బోట్లలో ఒకటి యూట్యూబర్‌దిగా తెలుస్తోంది. ఇకపోతే యూ ట్యూబర్ విశాఖపట్నంకు చెందిన వాసేనని.. సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారని స్థానికులు చెప్తున్నారు. అయితే అసలు అంత పెద్ద ప్రమాదం ఎలా సంభవించింది అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇకపోతే ఈ కేసులో యూట్యూబర్‌ను కేవలం అనుమానితుడిగానే అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

రాజకీయ నేతల పరామర్శ

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీపీ రవిశంకర్ అయ్యర్ నేరుగా రంగంలోకి దిగి కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ రూమ్ నంబర్ 7 ఎదురుగా ఉన్న బాలాజీకి చెందిన బో‌ట్‌లో మెుదట మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అంతేకాదు ఫిషింగ్ హార్బర్‌లో సీసీ కెమెరా ఫుటేజ్‌ను సైతం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాలను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పేర్ల రవిచంద్ర ఇతర నేతలు పరామర్శించి ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

గాఢనిద్రలో ఉండగా ప్రమాదం

ఇకపోతే పగలు అంతా వేటాడి అలసిపోయిన గంగపుత్రులు గాఢనిద్రలోకి జారుకున్నారు. అయితే అర్థరాత్రి ఊహించని రీతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్‌లో నిలిపి ఉన్న ఓబోటులో ప్రారంభమైన మంటలు రెప్పపాటులో మిగిలిన బోట్లన్నింటికి వ్యాపించాయి. మత్స్యకారులుఈ ప్రమాదాన్ని గమనించే సరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దాదాపు 45కిపైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది. విశాఖకు చెందిన మత్స్యకారులకు చేపలవేటే జీవనాధారం. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడమే వారికి తెలుసు. సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు బోట్లను ఉపయోగిస్తుంటారు. చాలా మంది మత్స్యకారులకు వేటాడటం వచ్చు కానీ సొంతంగా బోట్లు లేని పరిస్థితి. అలాంటి వారు బోట్లను అద్దెకు తీసుకువచ్చి వేటాడతారు. ఇలా పగటిపూట మత్స్యకారులంతా వేటకు వెళ్లి రాత్రిపూట బోట్లను ఫిషింగ్ హార్బర్‌లో పెట్టి సేద తీరుతారు. అలా బోట్లను పెట్టిన ఫిషింగ్ హార్బర్‌లోనే ప్రమాదం జరగడంతో గంటల వ్యవధిలో 45కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News