YSRCP: నేడు ఇడుపులపాయకు జగన్.. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
దిశా వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల నియామకం పై ద్రుష్టి సారిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలుమార్లు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం మరోసారి అభ్యర్థుల జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తోంది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు నేడు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. దీనికోసం ఆయన ఈ రోజు ఉదయం 10గంటల 40 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు జనగ్ రానున్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ వెళ్తారు. ఇడుపులపాయలో 12 గంటల 40 నిమిషాలకు వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల నుంచి ఒంటి గంటా 20 నిమిషాల వరకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను వైసీపీ ముఖ్య నేతల సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించనున్నారు. అభ్యర్థుల ప్రకటన కార్యక్రమం ముగిసిన తరువాత కాసేపు గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆతరువాత ఒంటి గంట 50 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి కడపకు బయల్దేరనున్నారు. అనంతరం కడప నుండి విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకోనున్నారు.
ఇక నేడు సీఎం జగన్ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తున్న సందర్భంగా వైసీపీ అధిష్టానం పార్టీ నేతలకు సమాచారం ఇచ్చింది. అలానే నేడు సీఎం జగన్ ఇడుపులపాయకు వస్తున్న నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఇక వైఎస్ సమాధి వద్ద రెండు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వేదికపై 11 మంది మాత్రమే కూర్చునే లా ఏర్పాట్లు చేయడం గమనార్హం. కాగా ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.