దసరాకు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాజిక వర్గాల సమతూకంతో ఎంపిక
దసరా పండగ నాటికి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అధికార టీడీపీ యోచిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: దసరా పండగ నాటికి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అధికార టీడీపీ యోచిస్తోంది. ఇదే విషయాన్ని శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జాబితాను రూపొందించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు వాయిస్‌తో ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వివరాలు సేకరించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వృథా అంటూ తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది.
గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు..
గత ప్రభుత్వాల్లో నామినేటెడ్ పోస్టులు దక్కాలంటే ఆశావహుల తిప్పలు అన్నీఇన్నీ కావు. గాడ్ ఫాదర్ల చుట్టూ అలుపెరగకుండా ప్రదక్షిణలు చేయాలి. పైస్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానా అవస్థలు పడేది. ఈసారి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాదిరిగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని భావిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేసిన వాళ్లెవరు.. ఏ మేరకు సేవలందించారనే అంశాలపై పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వివరాలు రాబట్టనున్నారు. అందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు వాయిస్‌తో ఐవీఆర్ఎస్కాల్స్ చేయనున్నారు. ఈ ప్రక్రియకు ఈపాటికే శ్రీకారం చుట్టారు.
కష్టపడిన వారికి పదవులు..
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ క్యాడర్ తీవ్రమైన ఎదురుదాడిని ఎదుర్కొంది. ఆస్తులు కరగదీసుకున్న వాళ్లు కొందరైతే.. భౌతిక దాడులను ఎదుర్కొన్నవాళ్లు మరికొందరున్నారు. పార్టీని ప్రజల్లో సజీవంగా నిలపడానికి తమ్ముళ్లు చాలా పెద్ద ఎత్తున బెదిరింపులను చవిచూడాల్సి వచ్చింది. నోరు విప్పితే ఏమవుతుందోనన్నంతగా ప్రతిపక్షంపై వైసీపీ సర్కారు దాడి చేసింది. చివరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడేట్లు చేసింది. టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్లను సైతం కేసులు పెట్టి భయోత్పాతానికి గురిచేసింది. క్షేత్ర స్థాయిలో అన్నింటినీ తట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడ్డ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నారు.
కార్యకర్తల నుంచి అభిప్రాయాల సేకరణ..
సీఎం చంద్రబాబు ఆలోచనకు తగ్గట్లుగా సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ రెండింటినీ బేరీజు వేస్తూ సామాజిక సమతుల్యతను పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రి వర్గ కూర్పులో ఎలాంటి బ్యాలెన్స్ పాటించారో అలాగే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పాటించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పదవులను ఆశిస్తున్న నేతలు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పన్లేదు. ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో వాళ్ల స్థాయి ఏమిటనే దాన్నిబట్టి పదవులు దక్కనున్నాయని తమ్ముళ్లు చెబుతున్నారు.