రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. రైతు సంఘాల నేతలు డియాండ్

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2023-05-24 16:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలో రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బుధవారం విజయవాడలోని దాసరి భవన్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులను అధిగమించి రాబోయే ఖరీఫ్‌కు రైతులు ఏరువాక సాగించేందుకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ఇబ్బందులతో వ్యవసాయానికి సిద్ధమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు రైతులు, కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. అకాల వర్షాలతో ఆహార పంటలు నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.50వేలు, వాణిజ్యపంటలకు ఎకరాకు రూ.75వేలు, పండ్ల తోటల రైతులకు ఎకరాకు రూ.లక్ష లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే చేపట్టే ఉద్యమ కార్యాచరణకు అఖిల భారత కిసాన్‌ సభ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.

Tags:    

Similar News