సాగునీటి కోసం ఉరితాళ్లతో రైతుల ఆందోళన
సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతాంగం సాగునీటి కోసం నానా పాట్లు పడుతుంది. గత కొన్ని రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాపట్లలో సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. పొలంలోనే ఉరితాళ్లతో నిరసన తెలిపారు. బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామ శివారులో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. సాగునీరు లేక కళ్లెదుటే ఎండిపోతున్న పంటను కాపాడుకోలేని దైన్య స్థితిలో ఉన్నామని రైతులు విలపించారు. సాగునీరు లేదని తాము ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఇది చాలా దుర్మార్గం అన్నారు. పంట వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని...ఆ పంటను కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నామని రైతులు తెలిపారు. సాగునీరు అందకపోవడంతో ఈ ఏడాది పంట చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా కాల్వల మరమ్మతులకు నోచుకోలేదని దాని ఫలితమే తాము ఈ దుస్థితి ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.