సైకో జగన్‌కి ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యింది: Nara Lokesh
నాపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరు’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ‘నాపై ఆరు కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేరు’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబును జైలుకు పంపితే తన పాదయాత్ర ఆగుతుందని భ్రమపడ్డారని చెప్పుకొచ్చారు. చివరికి అన్నా క్యాంటీన్‌నూ వదలలేదని ధ్వజమెత్తారు. స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో ఒక్క ఆధారమైనా చూపించలేకపోయారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో నారా లోకేశ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ఇక్కడ నిల్చున్నానని తెలిపారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటానని నారా లోకేశ్ ఘాటుగా హెచ్చరించారు. ‘సంక్షోభాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకూ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. కష్టాలకు ఎదురునిలబడి పోరాడే దమ్ము మనకి ఉంది’ అని నారా లోకేశ్ అన్నారు.
యుద్ధం మెుదలైంది
ఏపీలో యుద్ధం మొదలైంది. సైకో జగన్‌కి ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడే నెలలు.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అంటూ విమర్శించారు. యువగళం పాదయాత్ర కు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు ప్రజలను నారా లోకేశ్ క్షమాపణలు కోరారు. ‘ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జనవరి 27 న తాను యువగళం పాదయాత్ర ప్రారంభించాను. యువగళానికి బ్రేకుల్లేవు.. వీక్ ఆఫ్ లేదు, శనివారం, ఆదివారం లేదు. 209 రోజుల పాటు ప్రజల్లో ఉన్నా. 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2853 కిలోమీటర్లు పాదయాత్ర చేసాను. రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్, భవన నిర్మాణకార్మికులు, న్యాయవాదులు, రవాణారంగ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, ఆర్ఎంపీలతో అనేక ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నాను. టీడీపీ- జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కష్టాలు తీరుస్తా’ అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.