ఏలూరు కౌన్సిల్‌ ఖాళీ.. 27 మంది జంప్..!

ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ ఖాతాల్లోకి చేరింది....

Update: 2024-09-14 02:25 GMT

దిశ, ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ ఖాతాల్లోకి చేరింది. వైసీపీకి చెందిన మరో ఐదుగురు కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో టీడీపీలో చేరారు. ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఐదుగురు కార్పొరేటర్లు - వంకదారు ప్రవీణ్‌ కుమార్‌, దారపు అనూష, కలవకొల్లు సాంబ, అర్జి సత్యవతి, జనపరెడ్డి కనక శ్రీ రాజేశ్వరిలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే చంటి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు సహా 27 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో గతంలో చేరారు. తాజాగా మరో ఐదుగురు చేరడంతో కౌన్సిల్‌లో వైసీపీ ఖాళీ అయింది.

త్వరలో మరిన్ని చేరికలు

కార్పొరేటర్లు చేరిక సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ఏలూరు నియోజకవర్గంలో ఆదర్శవంతమైన పాలనకు శ్రీకారం చుట్టానన్నారు. రాజకీయాల్లో గౌరవం, విలువలు అనేవి ఎంతో కీలకమన్నారు. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో సాగుతున్న కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన వారికి టీడీపీలో స్థానం ఉంటుందన్నారు. 


Similar News