ఏపీ విద్యావిధానాలను దేశం ప్రశంసిస్తోంది : విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థకు అత్యధిక పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థకు అత్యధిక పెద్దపీట వేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలతో పేదవాడికి విద్య మరింత చేరువ అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య అనేది తల్లిదండ్రులకు భారం కాకూడదనే మంచి మనస్సుతో ఆ భారాన్ని ప్రభుత్వం భరించేలా సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. ట్యాబ్‌ల పంపిణీలతో డిజిటల్ విద్యను మరింత చేరువ చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సత్తా చాటాలి. దేశం మొత్తం ఏపీ విద్యావిధానాలను ప్రశంసిస్తోంది అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ను తీసుకురావడంతో విద్యారంగం మరింత మెరుగు పడిందని చెప్పుకొచ్చారు. అమ్మ ఒడి వంటి పథకం ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది అని అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని స్కూల్స్‌ను బాగు చేసేందుకు సీఎం జగన్ నాడు-నేడు వంటి పథకాన్ని తీసుకువచ్చారని మంత్రి వెల్లడించారు. ఈ నాడు-నేడు పథకంలో భాగంగా ఇప్పటికే 56 వేల స్కూల్స్ రూపు రేఖలు మారిపోయాయని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల హాజరు పెరిగింది అని మంత్రి బొత్స తెలిపారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు-నేడు పథకంలో భాగంగా ప్రతీ స్కూల్‌లో టాయిలెట్లు నిర్మించినట్లు తెలిపారు. అంతేకాదు డిజిటల్ విద్యను పేదవారికి చేరువచేసిన నాయకుడు జగన్ వైఎస్ జగన్ అయితే ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.