EC: తస్మాత్ జాగ్రత్త.. వాలంటీర్లకు హెచ్చరిక.. ఆ పని చేస్తూ దొరికితే ఇక జైలుకే..

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తీరు చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-03-19 07:40 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తీరు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం పలుమార్లు పేర్కొంది. ఇక ఇటీవల ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. అయినా అధికార పార్టీ ఎన్నికల కమిషన్ అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయకపోగా ఎన్నికల కోడ్ నిబంధనలను కూడా పాటించడం లేదని అటు ప్రతిపక్షాలు.ఇటు ఈసీ మండిపటుతోంది.

గతంలో ఈసీ అటు పార్టీ కార్యక్రమాలకు, ఇటు ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరం పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వైసీపీ నేతలు ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. వాలంటీర్లను పార్టీ ప్రచారంలో భాగం చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే వైసీపీ ప్రచారంలో మీరెందుకు పాల్గొంటున్నారని వాలంటీర్లను అడిగితే.. తమని అధికార ప్రభుత్వం ప్రచారం చెయ్యమనలేదని.. తమకు విధుల్లో భాగంగా ఇచ్చిన సిమ్ కార్డును కూడా తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేశామని.. అయితే తాము పార్టీ మీద ఉన్న అభిమానంతో ప్రచారంలో పాల్గొంటున్నట్లు వెల్లడిస్తున్నారు.

కానీ అధికార పార్టీ హై డ్రామా ఆడుతోందని.. వలంటీర్లకు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తూనే వైసీపీ వాలంటీర్లను తమ పార్టీ ప్రచారంలో వినియోగించుకుంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలానే వాలంటీర్లకు ప్రభుత్వం తరుపున ఇచ్చే జీతంతో పాటుగా వైసీపీ నుండి భారీ ముడుపులు అందుతున్నాయని, కుక్కర్లు, సెల్ ఫోన్ లు అధికార పార్టీ వాలంటీరులు పంచి పెడుతోందని.. విశాఖ నుండి గుడివాడ వరకు ఇదే తంతు నడుస్తోందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వైసీపీ వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వాడుకునేందుకే సిమ్ కార్డులను వెనక్కి తీసుకుంటుందని.. వైసీపీ కార్యకర్తలతో కలిసి వాలంటీర్లు ప్రచారంలో పాల్గొని దొరికినా, ప్రభుత్వానికి, వాలంటీర్లకు సంబంధం లేదని చెప్పేందుకు వైసీపీ ఈ హై డ్రామా అవలంబిస్తోందని.. ఇప్పటికైన ఎన్నికల సంఘం ఈ విషయం పై ద్రుష్టి సారించాలని విపక్షాలు ఈసీని కోరుతున్నాయి. అయితే గతంలోనే వాలంటీర్లు పార్టీ ప్రచారంలో పాల్గొంటే జైలు శిక్ష తప్పదని ఈసీ హెచ్చరించింది. అయినా వాలంటీర్లు వైసీపీ ప్రలోభాలకు లొంగి అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని సమాచారం. 

Tags:    

Similar News