Tuni Politics: యనమల భారీ స్కెచ్ వెనక మరో కోణం?
టీడీపీ నుంచి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, వైసీపీ నుంచి రోడ్లు భవనాల శాఖామంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం తుని. ...
దిశ, తుని: టీడీపీ నుంచి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, వైసీపీ నుంచి రోడ్లు భవనాల శాఖామంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం తుని. రాజకీయంగా ఇక్కడ ఏది జరిగినా పెద్ద వైరల్. మొన్నటి దాకా టీడీపీ సీటు ఇంఛార్జి యనమల కృష్ణుడుకు లేదనే ఎపిసోడ్ నడిచింది. అన్నదమ్ములు ఇద్దరికీ విభేదాలు వచ్చాయనే అంశం కొనసాగింది. అంతేగాక రామకృష్ణుడు కూతురు దివ్వ పేరు తెర మీదకు రావడంతో తమ్మడు కృష్నుడు అలక పాన్పు ఎక్కారని, దీంతో నిజంగా దివ్యకు సీటు ఇస్తే కృష్ణుడు సహకరించే పరిస్థితి లేదని అనుకున్నారు. దీంతో అన్నదమ్ములిద్దరూ కూడా ప్రత్యేక సమావేశాలు పెట్టుకొన్నారు. అయితే తాజాగా సీన్ మారింది. ఇదంటా డ్రామా అని చాలా మంది అంటున్నారు. టీడీపీ సీటు కోసం మూడో వ్యక్తి పోటీకి రాకుండా ఉండేందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద స్కెచ్ వేశారనే ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగమే అన్నదమ్ముల వివాద నాటకం అని తేల్చి చెబుతున్నారు. విషయమై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం
తమ్ముడిని మించిన ఆప్తమిత్రుడు రామకృష్ణుడుకు లేరు
వాస్తవానికి యనమల కృష్ణుడు అంటే రామకృష్ణుడుకు ఎంతో ప్రేమ. యనమల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కృష్ణుడు చాలా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రామకృష్ణుడిని కలవాలంటే ముందుగా తమ్ముడిని కలవాలి అంతే. ముందుగా తమ్ముడికి తన బాధ చెప్పుకొని , తర్వాతే రామకృష్ణుడికి చెప్పుకోవాల్సి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అన్న ఎంత పెద్ద పదవిలో ఉన్నా, తమ్ముడు పెత్తనం చేయాల్సిందే. అంతటి అభిమానం రామకృష్ణుడుకు తమ్ముడు అంటే. 6 సార్లు శాసన సభ్యుడిగా గెలిచినా, చాలా మార్లు మంత్రిగా పని చేసినా, ప్రతిపక్షంలో ఉన్నా సరే తమ్ముడు పెత్తనం చేయాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే తన రాజకీయ వారసుడు కృష్ణుడు అనే చెప్పాలి. గత రెండు పర్యాయాల నుంచి తుని సీటు కృష్ణుడికి అప్పగించారు. తాను ఓటమి పాలయినా సరే ఎదో రకంగా మళ్లీ సీటు ఇప్పించి గెలిపించాలని యనమల పిక్స్ అయ్యారు.
యనమల భయం అదేనా
ఇటీవల కాలంలో బీసీ నుంచి కొత్త తరం నాయకులు బయలు దేరుతున్నారు. ముఖ్యంగా యాదవుల నుంచి చాలా మంది వస్తున్నారు. ఇటీవల ప్రత్తిపాడుకు చెందిన అనుష యాదవ్ అనే మహిళ కూడా రంగంలోకి దిగారు. దీనికి తోడు మిత్ర పక్షంలో ఇక్కడి సీటు బీజేపీకి చెందిన వ్యక్తి స్థానికంగా ఆర్థికంగా పరిపుష్టి కలిగిన పారిశ్రామిక వేత్త. ఆయన కూడా తుని సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాజీ శాసన సభ్యుడు రాజా అశోక్ బాబు కూడా అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో యనమలలో భయం పట్టుకుంది. యనమల కుటుంబానికి కాకుండా వేరే వారికి సీటు ఇచ్చే ప్రయత్నానికి అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఈ విషయంపై ఇప్పటికే యువనేత లోకేష్ క్లారిటీగా ఉన్నట్లు సమాచారం. దీంతో యనమల పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. తెరపైకి తన కుమార్తె దివ్య పేరు తెచ్చారు. దీంతో తమ్ముడు కృష్ణుడు అలక పాన్పు ఎక్కారు. ఇదంతా వేరే వ్యకి సీటు ఆశించకుండా ఉండటం కోసమే అని తేలింది. ఇలా ఇరువురు కీచులాడుకుంటుంటే చివరికి మూడో వ్యక్తి రంగంలోకి దిగరనే ఆలోచన చేసినట్లు సమాచారం. విషయం గత రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో పెద్ద వైరల్ అవుతుంది. అయితే వాస్తవ విషయాలు కాలనుగుణంగా బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.