Yanamala Divyaకు తుని సీటు.. Chandra Babu Naidu కు కృతజ్ఞతలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తుని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య భేటీ అయ్యారు. అమరావతిలో చంద్రబాబుని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు...
దిశ, తుని: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తుని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య భేటీ అయ్యారు. అమరావతిలో చంద్రబాబుని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు తుని బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి గెలుపే లక్ష్యంగా పని చేస్తానని దివ్య తెలిపారు.
కాగా తుని టీడీపీ అభ్యర్థి విషయమై రెండు నెలలుగా హైడ్రామా కొనసాగింది. యనమల కృష్ణుడా? యనమల దివ్య..? లేక మూడో వ్యక్తి ఎవరైనా అనే చర్చగా సాగింది. ఒకానొక సందర్భంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కార్యకర్తల సమావేశంపెట్టి కృష్ణుడుకి టికెట్ ఇవ్వడం కష్టమేనని చెప్పడం జరిగింది. అక్కడ నుండే అస్సలు రాజకీయం ప్రారంభమైంది. మనసులోనే తీవ్ర బాధ పడ్డ కృష్ణుడు తన అంతరంగీకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో ఒక ఆడియో లీక్ కలకలం సృష్టించింది. యనమల రామకృష్ణుడు మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టి తమ అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవని వివరణ ఇచ్చుకున్నారు. తునిలో మూడో వ్యక్తి రాకుండా యనమల డ్రామాలు ఆడుతున్నారని ప్రతిపక్షం విమర్శలు గుప్పించారు.
కృష్ణుడు భవితవ్యం ప్రశ్నార్థకం..
తాజా పరిణామాలపై గత రెండు పర్యాయాలుగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలవుతున్న యనమల కృష్ణుడు రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఆయన దివ్య నాయకత్వాన్ని వ్యతిరేకించారు. తన అన్న యనమల రామకృష్ణుడిని కూడా తెర వెనుక శత్రువుగా భావించారు. కానీ తాజా పరిణామాల్లో దివ్యను ఇంచార్జిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో చంద్రబాబుకు యనమల దివ్య కృష్ణజ్ఞతలు తెలిపారు. మరి యనమల కృష్ణుడు పరిస్థితి ఏంటనేది చూడాలి.