MLA Dorababu కొంప ముంచిన పీఏ.. రంగంలోకి వంగా గీత

పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కేవలం తన పీఏ చక్రవర్తి కోసం చిక్కుల్లో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వడానికి కూడా అధిష్టానం అంగీకరించని రీతి దాకా వ్యవహారం వెళ్లింది...

Update: 2022-12-09 10:10 GMT
  • పిఠాపురం యంఎల్ఏకు టికెట్ హుళక్కేనా?
  • తాజా పరిణామాన్ని అవకాశంగా తీసుకొన్న అదిష్టానం
  • వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు ధీటుగా గీత బెటర్ అంటూ నిర్ణయం
  • అట్టడుగుకుపోతున్న పిఠాపురం..
  • పండగ చేసుకొంటున్న దొర బాబు వ్యతిరేక వర్గం

దిశ (ఉభయ గోదావరి): పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కేవలం తన పీఏ చక్రవర్తి కోసం చిక్కుల్లో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వడానికి కూడా అధిష్టానం అంగీకరించని రీతి దాకా వ్యవహారం వెళ్లింది. ఇప్పటి దాకా పీఏ ఆగడాలపై అధిష్టానం దొరబాబుకు తలంటు పోసినా ఆయన పట్టించుకోలేదు. ఇక లాభం లేదని ఏకంగా ఉభయ గోదావరి రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి రంగంలోకి వచ్చే సరికి దొరబాబు సర్దుబాటులో పడ్డారు. కానీ అప్పటికే సీన్ ముదిరిపోయిందనే చెప్పాలి. కాకినాడలో ఏకంగా 64 మంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే దొరబాబు వ్యక్తిగత సహయకుడు చక్రవర్తిపై చాలా ఫిర్యాదులు చేశారు. అతనే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. దీంతో మిథున్ రెడ్డి మండిపడ్డారు. నేరుగా దొరబాబుకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వనీయ సమాచారం. అంతేగాక వచ్చే ఎన్నికల్లో పార్టీ గుర్తు మీద పోటీ చేయాలని లేదా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది . ఈ వ్యవహారం పిఠాపురం నియోజకవర్గం అంతా కోడై కూస్తుంది. అంతేగాక ఇదే అంశాన్ని అధిష్టానం కూడా అవకాశంగా తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్‌కు ధీటుగా కాకినాడ ఎంపీ వంగా గీతను నెలబెడితే బాగుంటుందనే పార్టీ ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అందుకున్న ఫిర్యాదును పురస్కరించుకొని పెండెం దొరబాబును పక్కన పెట్టి వంగా గీతకు చాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. గీత అయితే పవన్‌కు దీటుగా పోటీ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో దొరబాబు వ్యక్తిగత సహాయకుడిపై వచ్చిన ఫిర్యాదు‌ను పురస్కరించుకొని అతనికి చెక్ పెట్టి గీతను రంగంలోకి దింపాలనేది అధిష్టానం వ్యూహం. ఈ వ్యవహారంతో పిఠాపురం రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. అధిష్టానం నుంచి జలక్‌ను అందుకున్న దొరబాబు పైకి ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతుండగా, దొరబాబు వ్యతిరేక వర్గం మాత్రం సంబరాలు జరుపుకుంటోంది.

వ్యక్తిగత సహాయకుడి రూటే సెపరేటు

పెండెం దొరబాబు పిఠాపురం నియోజకవర్గంలో రెండోసారి శాసనసభ్యుడిగా సేవలందిస్తున్నారు. రాజకీయాల మీద అవగాహన, మంచి పట్టు ఉన్న కాపు నాయకుడు. అయితే వాస్తవానికి రాజకీయ సలహలు ఇచ్చేందుకు పీఏ అవసరం లేదు. కానీ ఈసారి ఎందుకో ఆయన ప్రతీ చిన్న పని మీద పీఏ మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. పిఠాపురం మండలం జల్లూరుకు చెందిన వీరంరెడ్డి చక్రి అనే యువకుడు ఉపాధి హమీ పథకంలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతన్ని వ్యక్తి గత సహయకుడిగా పెట్టుకొంటే బాగుంటుందనే సలహా కొంతమంది ఇచ్చారు. దీనికి దొరబాబు ఓకే అన్నారు. అలా దొరబాబు వద్దకు చక్రి చేరాడు. దీంతో చక్రి తన పెత్తనంతో రెచ్చిపోయాడు. పాలనా విషయాల్లో జోక్యం మొదలైంది. తానే శాసనసభ్యుడి మాదిరిగా వ్యవ్యరించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు విసుగెత్తిపోయారు. దొరబాబుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.

అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లవ

పీఏ చక్రవర్త వ్యవహారం ముదిరిపాకాన పడటం, ఎమ్మెల్యే దొరబాబు పట్టించుకోకపోవడంతో స్థానిక వైసీపీ కేడర్ అధిష్టానాన్ని ఆశ్రయించింది. స్వయంగా పార్టీ పరిశీలకులు మిథున్ రెడ్డికి ఫిర్యాదులు చేశారు. ఆయన కాకినాడ వచ్చినప్పడు అయితే దారుణంగా ఏకరువు పెట్టారు. దీంతో మిథున్ రెడ్డికి మండింది. వెంటనే దొరబాబుకు ఫోన్ చేశారు. పీఏకి ఇంత సీనా అని హెచ్చరించారు. అంతేగాదు భవిష్యత్తులో పిఠాపురంలో పార్టీ గుర్తు మీద పోటీ చేయాలని ఉంటే పద్ధతి మార్చుకోమని హెచ్చరించినట్లు విశ్వనీయ సమాచారం. అవసరం అయితే అక్కడే ఇన్చార్జిని వేస్తానని తేల్చిచెప్పారు. దీంతో దొరబాటు దిద్దు బాటులో పడ్టారు. గట్టు చప్పుడు కాకుండా పీఏను మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు పడ్డారు. కానీ నిత్యం నీడలా వెంటాడే పీఏ కనపడకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో విషయం ఆరాతీస్తే జరిగిన తంతు బయట పడింది.

ఉదంతాన్ని అవకాశంగా తీసుకోనున్న అధిష్టానం

వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో జనసేన తరుపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీనికి దీటైన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించింది. ఇందులో భాగంగా గతంలో ఇక్కడ ప్రజారాజ్యం తరుపున శాసన సభ్యురాలిగా గెలిపొందిన ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత పేరు పరిశీలనలో ఉంది. ఆమెకు స్థానికంగా ఇంఛార్జి బాధ్యతలు అప్పచెప్పి ముందుగానే జనంలోకి పంపాలనే యోచనలో అధిష్టానం ఉంది. తాజా ఉదంతాన్ని అవకాశంగా తీసుకొంది. ఇదే అదునుగా దొరబాబును పక్కన పెట్టాలనే ఆలోచనలో పార్టీ ఉంది. వాస్తవానికి దొరబాబు కూడా కాపు కులానికి చెందిన వ్యక్తే. అయితే గీతకు ఉన్న పట్టు దొరబాబుకు లేదని అనేకమంది విశ్లేషిస్తున్నారు. అంతేగాక దొరబాబును ప్రస్తుతం వచ్చిన ఆరోపణలతో చెక్ పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో దొరబాబు నుంచి కూడా అసమ్మతి బెడద ఉండే ప్రమాదం ఉంది. దీంతో సందట్లో సడేమియా అన్నట్లు దొరబాబును సుతిమెత్తగా తప్పించి గీతకు చాన్స్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదని అధిష్టానం భావిస్తుంది. అయితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Also Read....

రాజ్యసభ జీరో అవర్‌లో కేంద్రానికి ఎంపీ V. Vijayasai Reddy రిక్వెస్ట్

Tags:    

Similar News