East, West Ycpలో హాట్ టాపిక్‌గా నలుగురు ఎంపీల వ్యవహారం!

ఉభయ గోదావరి జిల్లాల్లో నలుగురు ఎంపీల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వారు ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటు సభ్యులుగా ఉన్నా వారు మాత్రం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు...

Update: 2022-12-25 11:05 GMT

దిశ (ఉభయ గోదావరి): ఉభయ గోదావరి జిల్లాల్లో నలుగురు ఎంపీల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వారు ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలకు పార్లమెంటు సభ్యులుగా ఉన్నా వారు మాత్రం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉంటే ఆర్భాటాలు లేవని, శాసనసభకు పోటీ చేసి ఎంఎల్ఏగా గెలిస్తే తమకు అనుకూలంగా ఉన్న కోటా నుంచి మంత్రి పదవి కొట్టేయవచ్చని వారు ఆశ పడుతున్నారు. దీంతో వారు ఇప్పటి నుంచే పాచికలు వేస్తున్నారు. తమకు పార్టీపరంగా, సామాజికవర్గం పరంగా అనుకూలంగా ఉన్నా అసెంబ్లీ స్థానాలను ఎంచుకొంటున్నారు. అక్కడ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. అధిష్టానాన్ని ఇప్పటి నుంచే ఒప్పించే పనిలో పడ్డారు.


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇదే కోవకు చెందిన వారు అని చెప్పాలి. వీరు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నా భవిష్యత్తులో ఎంఎల్ఏలు అవ్వాలనే కోరికలో ఉన్నారు. దీని కోసం పాచికలు వేస్తున్నారు. అదృష్టవ శాత్తూ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయనే నమ్మకంలో ఉన్నారు.

పిఠాపురం వైపు కాకినాడ ఎంపీ వంగా గీత చూపు

కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత చూపు పిఠాపురం అసెంబ్లీ వైపు పడింది. అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గీత అయితే అందుకు దీటుగా పోటీ ఉంటుందని వైసీపీ ప్రచారం చేస్తున్నారు. వంగా గీత గతంలో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. దీంతో పిఠాపురంలో ఆమెకు పట్టు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గీత కన్ను పిఠాపురంపైనే పడింది. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు సునాయాసమని భావిస్తున్నారు. గెలిస్తే మహిళ కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కించుకోవచ్చనే నమ్మకంలో ఆమె ఉన్నారు. దీంతో వంగా గీత ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీలో మంచి పట్టున్న కాకినాడ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాకినాడ పార్లమెంటు సిగ్మెంటుకు ఎంపీగా ఉన్నా ఆమె ప్రస్తుతం పిఠాపురం సిగ్మెంటులో అధికంగా కార్యక్రమాలు చేస్తున్నారు.

రిజర్వుడు స్థానాల్లో ఎక్కడైనా ఒకే..

అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె తన పార్లమెంటు పరిధిలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం వంటి మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. వాటిలో ఎక్కడి నుంచైనా అసెంబ్లీకి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. చింతా అనురాధ భర్త ఐఏఎస్ కేడర్‌లో మంచి ఉద్యోగం చేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. అతనికి ముఖ్యమంత్రి జగన్‌తో మంచి సంబందాలున్నాయనే వినికిడి నడుస్తుంది. దీంతో అనురాధ ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ సీటు సాధించుకొంటారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ స్థానం నుంచి గెలిస్తే మహిళ కోటా లేక ఎస్సీ కోటా నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కించుకొంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.

రాజమండ్రి సిటీ వైపు మార్గాని భరత్

యువకుడు, విద్యావంతుడైన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి సిటీ శాసన సభ్యుడిగా పోటీ చేసే ప్రయత్నంలో పడ్డారు. భరత్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడం. దీనికి తోడు యువకుడు అవ్వడంతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. అంతేగాక మంత్రి పదవి కూడా దక్కుతుందని అంటున్నారు. దీని కోసం ఆయన ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికంగా చోటు చేసుకొంటున్న ప్రతి చిన్న విషయంలోనూ తన దైన శైలిలో వ్యవహారం చక్క బెట్టి అధిష్టానం కను సన్నలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల అమరావతీ రైతులు పాదయాత్ర సమయంలో వారిపై సీసాలు రువ్వి వార్తల్లో ఎక్కారు. అయితే అధిష్టానం మార్గాని భరత్ విషయం ఎలా పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

టీడీపీకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రఘరామ కృష్ణంరాజు

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి సీటు అడుగుతున్నారు. తన అభ్యర్థనను పార్టీ అంగీకరిస్తే నరసాపురం పార్లమెంటు నియోజవకర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సిగ్మెంట్లకు అభ్యర్థుల ఖర్చు తానే భరిస్తానని అంటున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది. నిజంగా అదే జరిగితే ఉండిలో క్షత్రియ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది కాబట్టి, రఘరామకృష్ణంరాజు గెలుపు ఖాయం అని అంచనా వేస్తున్నారు. అంతేగాక క్షత్రీయుల కోటాలో మంత్రి పదవి కూడా దక్కించుకోవచ్చనే నమ్మకంలో ఉన్నారు.

Tags:    

Similar News