Breaking: కాపు సంక్షేమ సేనలో విభేదాలు.. ఉపాధ్యక్షుడు తిరుమలరావు రాజీనామా
కాపు సంక్షేమ సేన సంఘంలో విభేదాలు తలెత్తాయి...
దిశ, వెబ్ డెస్క్: కాపు సంక్షేమ సేన సంఘంలో విభేదాలు తలెత్తాయి. ఆ సంఘం అధ్యక్షుడు హరిరామజోగయ్య తీరును నేతలు విభేదిస్తున్నారు. దీంతో ఆ సంఘం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంచి సలహాదారుడిగా ఉంటానంటూనే విమర్శిస్తూ లేఖలు రాయడంపై కాపు సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీని ఏ మాత్రం విమర్శించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరడాన్ని తప్పుబడుతున్నారు. ఈ మేరకు కాపు సంక్షేమ సేన సంఘం నుంచి వీడి బయటకు పోతున్నారు.
తాజాగా కాపు సంక్షేమ సేన సంఘం ఉపాధ్యక్షుడు తిరుమల రావు రాజీనామా చేశారు. హరిరామజోగయ్య రాస్తున్న లేఖలతో ఇబ్బంది అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తిరుమలరావు మీడియాతో మాట్లాడారు. జనసేనకు మద్దతుగా ఉన్నామా.. ఇబ్బందులు తెస్తున్నామా అని తిరుమల రావు ప్రశ్నించారు. జనసేనకు కాపు సంక్షేమ సేన అనుబంధ సంస్థలా ఉండాలని, కానీ హరిరామ జోగయ్య తీరుతో ఇబ్బంది అవుతుందని తెలిపారు. తమతో చర్చించకుండానే పవన్ కల్యాణ్‌కు హరి రామజోగయ్య లేఖలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాపై హరి రామజోగయ్యకు సమాచారం అందజేశామని తిరుమలరావు తెలిపారు.
Read More..