Pithapuram మున్సిపాలిటీలో అవినీతి రచ్చ.. రచ్చ!
కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో అవినీతి వ్యవహారం రచ్చకెక్కింది..
దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో అవినీతి వ్యవహారం రచ్చకెక్కింది. కౌన్సిల్ సమావేశం సాక్షిగా మున్సిపల్ డీఈ భవానీ శంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో పాత స్క్రాబ్ వేలం పాట వ్యవహారం ఎవరిని అడిగి చేశారని, ఇందులో అధికారులు ఎంత తీసుకున్నారని కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో కోపోద్రేకుడైన డీఈ భవానీ శంకర్ ‘ఎవరు ఎంత తీసుకున్నారో త్వరలో తేలుస్తా.. ఓ వ్యక్తికి నేనే స్వయంగా 65 వేలు ఇచ్చా. అన్ని ప్రెస్ మీట్ పెట్టి చెబుతా’ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
దీంతో డబ్బులు తీసుకున్న వ్యక్తి పేరు చెప్పండంటూ వైసీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఈ క్రమంలో వైసీపీ కౌన్సిలర్లకు, డీఈకి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరికి డబ్బులు ఇచ్చారో తేల్చాలని కౌన్సిలర్లు మరింతగా పట్టుబట్టడంతో డీఈ ‘అందరి జాతకాలు బయటకొస్తాయి. ఉద్యోగులంటే ఆషా మాషిగా ఉందా..భయపెట్టాలని చూస్తారా..ఇక్కడెవరు భయపడేది లేదు. ఛైర్మన్ ఛాంబర్‌లోకి వస్తే ఎవరికి ఎంతిచ్చామో చెబుతా’నంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో అంతా కంగుతిన్నారు.
ఇదిలా ఉండగా పిఠాపురం పట్టణంలో మూలనపడ్డ ట్రాక్టర్లు, ఇంజన్లతోపాటు, ఇతర ఐరన్ స్క్రాబ్ విషయంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కొంత మంది వైసీపీ కౌన్సిలర్లు తనను డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్నారని డీఈ ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
అధికారులు నలిగిపోతున్నారా..!
పిఠాపురం మున్సిపాల్టీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు 24 మంది వరకూ ఉన్నారు. ఇక్కడ వైసీపీకి చెందిన గండేపల్లిసూర్యావతి ఛైర్‌పర్సన్. అయితే మొత్తం కౌన్సిల్ వ్యవహారాలన్ని ఆమె భర్త గండేపల్లి బాబి చూస్తారు. ఆయన కూడా కౌన్సిల్‌లో కో-ఆప్షన్ మెంబర్‌గా కూడా ఉన్నారు. అయితే అభివృద్ధి పనులు, వేలం పాటల వ్యవహారంలో కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు అధికారులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పని చేస్తే ఒకలా, చేయకపోతే ఒకలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే. అందరి జాతకాలు తేలుస్తానంటూ డీఈ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సదరు వ్యక్తుల జాతకాలు ఎక్కడ బయటపడతాయోనన్న ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే అసలు మున్సిపాల్టీలో పాత ఐరన్ స్క్రాబ్ వ్యవహారం తమకు తెలియదని ఛైర్‌పర్సన్ వర్గం అంటోంది. ఎవరికి ఎవరు డబ్బులిచ్చారో తేలితే బాగుంటుందని చెబుతోంది. మొత్తం మీద పిఠాపురం కౌన్సిల్‌లో అవినీతి మాత్రం రచ్చ రచ్చగా మారింది. భవిష్యత్తులో ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయనేది చర్చనీయాంశమైంది.