Tdp Mahanadu: సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం
మహానాడు వేదికగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నలతో కడిగి పారేశారు....
దిశ, వెబ్ డెస్క్: మహానాడు వేదికగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు ప్రశ్నలతో కడిగి పారేశారు. సహకరిస్తే సరేనని.. లేదంటే టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అలాగే మహానాడు వేదికగా టీడీపీ చేసిన అభివృద్ధిని వివరించారు. సంపద సృష్టించిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఎన్టీఆర్‌తోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. తన హయాంలోనూ చాలా కార్యక్రమాలు చేశానని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారి పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీదని తెలిపారు. రూ.200 ఉన్న పింఛన్‌ను పది రెట్టు పెంచిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఎవరికీ ఏ లోటు రాకుండా చేసి 2029కి దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా ఉండాలని ప్రణాళిక చేసిన పార్టీ టీడీపీ అని చెప్పారు.
ఆర్థిక లోటు ఉన్నా అభివృద్ధి చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక్క ఇరిగేషన్‌కే రూ. 64 వేల కోట్ల ఖర్చు చేశామన్నారు. 16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఒక్క ఛాన్స్ అని జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. కోడి కత్తి డ్రామా, తండ్రి లేని బిడ్డనని రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్ధత, విధ్వంసానికి నాంది పలికిన జగన్ ఒక సైకో అని విమర్శించారు. ప్రజా వేదిక ద్వారా విధ్వంసాన్ని ప్రారంభించాడని మండిపడ్డారు. తెలుగువారు చరిత్రను తిరగరాసేలా అమరావతికి రూప కల్పన చేశామని పేర్కొన్నారు. కానీ జగన్ వచ్చి అమరావతిని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేసే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
‘వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించాడు, పెట్టుబడులు లేవు. నిరుద్యోగులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. దిశ చట్టాన్ని అబాసు పాలు చేశాడు. ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని ఆనాడు జగన్ చెప్పారు. 25 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మోసం చేశారు. ఢిల్లీ వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.’’ అని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.